Share News

విద్యా ప్రమాణాల పెంపునకు కార్యాచరణ చేపట్టాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:20 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు బోధనాభ్యసన ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

విద్యా ప్రమాణాల పెంపునకు   కార్యాచరణ చేపట్టాలి: కలెక్టర్‌
విద్యాశాఖ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

నంద్యాల నూనెపల్లి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు బోధనాభ్యసన ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మిషన్‌ మార్చ్‌, సమగ్ర శిక్ష, పీఎం శ్రీ పాఠశాలల నిధుల వినియోగం, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, గణిత సామర్థ్యాలను పెంపొందించే ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు జూన్‌, జూలై, ఆగస్టులో 99.12, 99.34, 99.61 శాతం నమోదైందని సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలో తగ్గు ముఖం పట్టడంపై ఆరా తీశారు. హాజరు తగ్గడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉపాధ్యాయుల హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. సమగ్ర శిక్ష కింద విడుదలైన రూ.24.13 కోట్లలో 87 శాతం నిధులు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించగా మిగిలిన నిధులతో చేపట్టాల్సిన పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం శ్రీ పథకం కింద 44 పాఠశాలలు, 183 ల్యాబ్‌లకు కేటాయించిన నిధుల వినియోగాన్ని సమీక్షిస్తూ మిగిలిన నిధులను కూడా నిబంధనల ప్రకారం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో మంజూరైన ఆరు ఆటిజం కేంద్రాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పీఎం జన్మన్‌ హాస్టళ్ల నిర్మాణం పూర్తి చేయాలని వివరించారు. సమావేశంలో డీఈవో జనార్దన్‌రెడ్డి, నంద్యాల, డోన్‌ డిప్యూటీ డీఈవోలు శంకర్‌ప్రసాద్‌, వెంకటరాముడు, సమగ్ర శిక్ష ఈఈ మురళీధర్‌రెడ్డి, ఎఫ్‌ఏవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:20 AM