కుక్కల దాడిలో 44 గొర్రెలు మృతి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:08 AM
మండల పరిధిలోని ఐరన్‌బండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కుక్కల దాడిలో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
గోనెగండ్ల, జూన్ 12(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఐరన్‌బండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కుక్కల దాడిలో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ గొర్రెలు అన్నీ వ్యాపారులు సంతలో విక్రయించేందుకు ఇతర ప్రాంతాల్లో కొని తీసుకొచ్చారు. ఐరన్‌బండ గ్రామానికి చెందిన బజారి, చంద్ర, రమేష్ గొర్రెల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. శని, ఆది, సోమవారాలలో కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ పట్టణాలలో గొర్రెల సంతలో విక్రయించేందుకు గురువారం తెలంగాణలోని పెబ్చేరు సంతకు వెళ్లి అక్కడ రూ. 4లక్షలు పెట్టి గొర్రెలను కొని గురువారం రాత్రి ఐరన్‌బండ గ్రామంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో వాటిని నిలిపారు. అయితే కార్యాలయం నిర్మాణంలో ఉండటంతో గదులకు తలుపులు లేవు. చిన్నపాటి తడికను అడ్డంగా పెట్టి రాత్రి ఇండ్లకు వెళ్లి పోయారు. తెల్లవారుజామున గొర్రెలను గుర్తించిన కుక్కలు తలుపులు లేని కారణంగా 10 కుక్కలు వెళ్లి గొర్రెలపై దాడి చేసి కొరికి చంపి వేశాయి. గొర్రెలు అరవడంతో చుట్టు పక్కల ఉన్న గ్రామస్థులు లేచి పంచాయతీ కార్యాలయం దగ్గరకు వచ్చి చూడగా కుక్కల దాడిలో 44 మృతిచెందాయి. ఈ విషయం తెలుసుకున్న బజారి, చంద్ర, రమేష్ లు కన్నీరు పర్యంతం అయ్యారు. రూ.4 లక్షలు నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.