వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదు.. కానీ: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:29 PM
వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారి విధివిధానాలను ప్రశ్నిస్తే.. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
అమరావతి, జూన్ 27: వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారి విధివిధానాలను ప్రశ్నిస్తే.. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు(శనివారం) పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. ‘మెత్తగా ఉండాలి కానీ.. మరీ మౌనంగా ఉంటే చేతకానితనంగా చూస్తారు. ఇటీవల పంతం నానాజీ మాట్లాడింది నేను చూశాను. అటువంటివి సమర్థించం. కానీ అదే ప్రాంతంలో ఉన్న వైసీపీ నేత ఏం మాట్లాడారో ఆ పార్టీ నాయకులకు తెలీదా. మీకు నోరుంది కదా అని అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు.. ఎక్కడా తగ్గకండి.11 సీట్లు కాదు.. ఒక్కస్థానానికి చేరినా.. ఇలాగే ఇష్టారాజ్యంగా మాట్లాడండి. సీఎం చంద్రబాబు సతీమణి గురించి మాట్లాడితే ప్రశ్నించకూడదా. అసలు మీలో రియలైజేషన్ ఎంతవరకు వస్తుందో మేమూ చూస్తాం. మీరు తిట్టినా.. తిట్టకపోయినా.. మేము బలపడటం గ్యారంటీ’ అని పవన్ కల్యాణ్ అంటూ వ్యాఖ్యానించారు.
పార్టీని ముందుకు తీసుకువెళ్లే కార్యకర్తే సాధక్
సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కాదని.. కానీ అర్హులైన వారికి పూర్తిగా అందాలనేది తమ విధానమని పవన్ స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి సారించినట్లు చెప్పారు. వ్యవస్థలను బలోపేతం చేయాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు. నేడు గ్రామాలలో, నగరాలలో రోడ్లు వేసింది ఎవరు అని ప్రశ్నించారు. కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రజలు ఓట్లు వేయరని.. ఇందుకు వైసీపీనే అందరికీ నిదర్శనమన్నారు. పథకాలు పేరు చెప్పి.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించపోతే ఎలా అంటూ నిలదీశారు. గ్రామాలలో తాగునీటిని పూర్తిగా అందేలా కేంద్రం సహకారంతో చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని మౌలిక వసతులు కల్పించాలని.. అది లేకుండా ఎన్ని ఉచితాలు ఇచ్చినా ప్రజలు స్వాగతించరని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజల అవసరాలను ముందు గుర్తించాలని పవన్ సూచించారు. బడ్జెట్‌లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో ముందే ఆలోచన చేయాలన్నారు. విశాఖలో 2025 ఆగష్టులో నిర్వహించిన సేనతో సేన కార్యక్రమం ద్వారా మెంబర్‌షిప్ చేపట్టామన్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లే కార్యకర్తే సాధక్ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల మంది సభ్యత్వం కోసం సాథకులు పని చేశారని తెలిపారు. సభ్యత్వ నమోదు ద్వారా నాయకత్వ సామర్ధ్యాన్ని నిరూపించారని సాథకులను ప్రశంసించారు. 18వేల మంది సాధక్‌లను నాయకత్వ దిశగా తీసుకెళ్తే.. మంచి ఫలితాలు వస్తాయని పవన్ అన్నారు.
వారిని సాధక్‌లు నిర్ణయించాల్సిందే..
‘సమాచారాన్ని సేకరించడం వరకే మీ బాధ్యత.. ఆ నివేదికను బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. మీరు ముందు ఉన్నా.. మీకు రక్షణ కవచంగా నేను వెనుకే ఉంటాను. జనసేన మహిళలు, సైనికుల పని తీరును బట్టి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కమిటీ పని చేస్తుంది. మీరు ఇచ్చిన సమాచారం దారి మళ్లకుండా నా ఆఫీస్ తరఫు నుంచి ఐదు మందిని అదనంగా పంపిస్తున్నాను. ఈ కమిటీల ప్రధాన బాధ్యత.. నాయకులను ఎంపిక చేయడం కాదు. పారదర్శకమైన సమాచారం సేకరించడమే. పని చేసే వ్యక్తుల కష్టాన్ని నేను తప్పకుండా గుర్తిస్తాను. కమిటీల జాబితా రిలీజ్ చేసిన తర్వాత.. వారు ఎక్కడ పని చేశారో మాకు తెలియదంటూ కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఈ కమిటీల ప్రధాన బాధ్యత నిస్వార్థంగా పని చేసి వారిని గుర్తించి నా పరిశీలనకు పంపడమే. వారు ఎన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తున్నారో తెలుసుకున్నాకే సాధకులుగా నియమించాం. జనాలతో మమేకమయ్యే వారినే మేము తీసుకున్నాం. ఎవరు పదవుల్లోకి రావాల్సి ఉన్నా సాధక్‌లే నిర్ణయించాల్సి ఉంది. కమిటీలో ఉన్న వారికి పార్టీ విధివిధానాలు అందజేస్తాం. ఆ రూల్‌బుక్ ప్రకారమే సమాచారం సేకరించి.. నా దృష్టికి తీసుకు రావాలి. వాటి ఆధారంగా పార్టీ ముఖ్య నేతలతో చర్చించి.. సమష్టి నిర్ణయంతో బాధ్యతలు అప్పగిద్దాం. పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించకపోతే పార్టీ సంస్థాగతంగా ఎలా బలోపేతం చేస్తాం’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. పోలీసుల అదుపులో సీఐ నాగరాజు స్నేహితుడు
సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం: జేసీ ప్రభాకర్
Read Latest AP News And Telugu News