Share News

ఇంతింత కాదయా!

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:41 AM

2014 నుంచి 2019 దాకా కేఎన్‌ఆర్‌ అధికారికంగా చూపించిన మొత్తం ఆదాయం రూ.18.24 లక్షలు మాత్రమే. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆదాయ వేగం పెరిగిన తీరు అంచనాలకు అందడం లేదు.

ఇంతింత కాదయా!

  • ఐదేళ్లలో భారీగా పెరిగిన కేఎన్‌ఆర్‌ ఆదాయం

  • వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు జగన్‌ ఆస్తులు రూ.9 లక్షలు మాత్రమేనని 2004 ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపారు. కాంగ్రెస్‌ తరఫున 2009లో కడప ఎంపీగా పోటీ చేసే సమయానికి ఆయన ఆస్తుల విలువ రూ.77 కోట్లు.. తండ్రి మరణించాక సొంత పార్టీ పెట్టి కడప ఎంపీగా 2011లో ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు ఏకంగా రూ.365 కోట్లుగా చూపించారు. ఇవన్నీ తండ్రి అధికారంలో ఉండగా తండ్రి మేళ్లకు తనయుడు పొందిన ప్రతిఫలాలేనని సీబీఐ నిగ్గుతేల్చింది. తన నేతను చూసి స్ఫూర్తి పొందారో ఏమో ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్‌) ఆస్తి కూడా ఐదేళ్లలో 20 రెట్లు పెరిగింది.

  • 2019కి ముందు ఆయన వార్షిక రాబడి రూ.3.64 లక్షలు

  • జగన్‌ సీఎం అయ్యాక ఐదేళ్లలో 74.15 లక్షలకు పెరుగుదల

  • ఇంటి అద్దె చెల్లించే స్థితి నుంచి అద్దె ఆదాయం పొందే స్థాయికి

  • చేబదుళ్లు తీసుకునే దుస్థితి నుంచి వడ్డీలు వసూలు చేసే ఎత్తుకు

  • కేఎన్‌ఆర్‌ ఆస్తులు, బినామీల గుట్టు తేలుస్తున్న సిట్‌ అధికారులు

  • బెజవాడ ఆఫీసులో సుదీర్ఘ విచారణ

  • ఈడీ చేతికి ఆయన ఆస్తుల వివరాలు

  • జగన్‌ పీఏకు బిగుస్తున్న ఉచ్చు

2014 నుంచి 2019 దాకా కేఎన్‌ఆర్‌ అధికారికంగా చూపించిన మొత్తం ఆదాయం రూ.18.24 లక్షలు మాత్రమే. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆదాయ వేగం పెరిగిన తీరు అంచనాలకు అందడం లేదు. మ ద్యం స్కాం కేసులో కీలక నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో జరిగిన లావాదేవీల వ్యవహారంలో ఆయన్ని ప్రశ్నిస్తున్న సిట్‌ అధికారులు ఆయన ఆర్థిక వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆస్తుల గుట్టు రట్టు చేసే పనిలో భాగంగా.. కేఎన్‌ఆర్‌తో పాటు అతడి చిన్ననాటి స్నేహితుడు, బినామీగా భావిస్తున్న వైసీపీ నేత పుత్తా శివశంకర్‌రెడ్డి, విజయవాడలో హ్యుండాయ్‌ షోరూం భాగస్వామి ఉస్మాన్‌ సందీప్‌, ఆర్థిక లావాదేవీలు జరిపిన మరికొందరు వ్యక్తులను బ్యాంకు స్టేట్‌మెంట్లతో రమ్మన్న సిట్‌ అధికారులు.. సోమవారం విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో వారిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. చిన్న వ్యాపారంతో జీవనం సాగించిన కేఎన్‌ఆర్‌ కొద్ది కాలంలోనే భారీ మూలధన లాభాల ద్వారా కోట్ల ఆదాయ వర్గంలోకి ఎలా చేరారో ఆరా తీశారు.


షేర్ల విక్రయాలు.. రియల్‌ లావాదేవీలు..

వైసీపీ అధికారంలోకి రాకముందు కేఎన్‌ఆర్‌ వార్షిక ఆదాయం రూ.3.64 లక్షలు ఉండగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 74.15 లక్షలకు పెరిగింది. జగన్‌ సీఎం కాక ముందు కేఎన్‌ఆర్‌ కుటుంబం చిన్న వ్యాపారం చేస్తున్నట్లు చూపించి మొత్తం టర్నోవర్‌ రూ.35 లక్షలుగా పేర్కొన్నారు. ఆ వ్యాపారం 2020-21 నుంచే నిలిచిపోయినట్లు బ్యాంకు లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. కానీ కరోనా తర్వాత కేఎన్‌ఆర్‌ రాబడి ఒక్కసారిగా పుంజుకుంది. జీతం తీసుకునే స్థాయి నుంచి జీతభత్యాలు చెల్లించే స్థితికి.. ఇంటికి అద్దె చెల్లించే పరిస్థితి నుంచి పొరుగు రాష్ట్రాల్లో ఇంటి అద్దెలు వసూలుచేసే స్థాయికి.. చేబదుళ్లు తీసుకునే దుస్థితి నుంచి వడ్డీలు వసూలు చేసే ఎత్తుకు అతడు ఎదిగాడు. షేర్ల విక్రయాలు, రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలతో భారీగా ఆర్జించినట్లు ఐటీ రిటర్న్స్‌లో చూపించాడు. జగన్‌ సీఎం అయ్యాక ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకున్న కేఎన్‌ఆర్‌.. ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 2021-22 నుంచి వరుసగా మొదటి ఏడాది రూ.18 లక్షలు, రెండో ఏడాది రూ.30 లక్షలు, ఆ తర్వాత రూ.42 లక్షలు, నాలుగో సంవత్సరం రూ.39 లక్షలు చూపించిన కేఎన్‌ఆర్‌.. జగన్‌ ప్రభుత్వ చివరి ఏడాదిలో రూ.40 లక్షలు స్థూల ఆదాయం పొందినట్లు చూపించాడు. అయితే 2022-23లోనే బెంగళూరులో కొనుగోలు చేసిన ఆస్తి నుంచి అద్దె రూపంలో ఆదాయం వస్తున్నట్లు పొందుపరిచాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కేవలం 18 లక్షల ఆదాయం చూపించిన అతడు.. ఐదేళ్ల కాలంలో రూ.4.44 కోట్లకు పెంచుకున్నట్లు ఐటీ రిటర్న్స్‌ చెబుతున్నాయి. సోమవారం వీటన్నిటిపైనా సిట్‌ లోతుగా ప్రశ్నించి పై వివరాలన్నీ రాబట్టినట్లు తెలిసింది. దర్యాప్తులో బయటపడుతున్న కేఎన్‌ఆర్‌ భారీ ఆస్తుల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే అతడికి ఉచ్చు బిగించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

- అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 02 , 2026 | 05:41 AM