Share News

ఏపీకి తమిళనాడు, కర్ణాటక సాయం

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:02 AM

అర్నబ్‌ తుఫాన్‌ నష్టం నుంచి ఆంధ్రప్రదేశ్‌ త్వరితగతిన కోలుకునేలా సాయం చేయడానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ముందుకు వచ్చాయి.

ఏపీకి తమిళనాడు, కర్ణాటక సాయం

  • విద్యుత్‌ పునరుద్ధరణ పనులకు రెండు రాష్ట్రాల నుంచి 1,000 మంది సిబ్బంది

  • అన్ని విధాలా సాయానికి సిద్ధం: డీకే శివకుమార్‌

బెంగళూరు/చెన్నై, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ నష్టం నుంచి ఆంధ్రప్రదేశ్‌ త్వరితగతిన కోలుకునేలా సాయం చేయడానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అన్ని విధాలా సాయంచేసేందుకు కర్ణాటక సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. బెంగళూరు విధానసౌధలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ పునరుద్ధరణ, మౌలిక సదుపాయాలకు సహకారం అందిస్తామని అన్నారు. ఏపీకి 500 మంది నిపుణులైన లైన్‌మెన్లను, క్రేన్‌లు, 15 పాల్‌ఫింగర్‌ లారీలు, 25 ట్రాక్టర్‌ ఆధారిత డ్రిల్లింగ్‌ యంత్రాలు పంపుతామని తెలిపారు. అర్నబ్‌ నష్టాలను రెండురోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు తనకు వివరించారని తెలిపారు.

ఏపీలో అత్యవసరంగా విద్యుత్‌ పునరుద్ధరణ పనులకు బృందాలను సిద్ధం చేస్తున్నామన్నారు. పదిమంది చొప్పున లైన్‌మన్లను ఓ బృందంగా విభజించి, ఒక జూనియర్‌ ఇంజనీర్‌, ఒక అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నేతృత్వంలో ఏపీ అధికారులు సూచించే ప్రదేశాలకు పంపి సేవలు అందిస్తామని తెలిపారు. కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్‌ మాట్లాడుతూ, అత్యాధునిక యంత్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ పునరుద్ధరణ ప్రక్రియ పనులను కర్ణాటక బృందా లు త్వరలోనే చేపడతాయని తెలిపారు. ఇక తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస పనులు చేపట్టేందుకు తమిళనాడు నుంచి 500 మంది విద్యుత్‌ బోర్డు కార్మికులను పంపించినట్లు ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి నిర్మల్‌కుమార్‌ చెప్పారు. సోమవారం చెన్నై నుంచి ఏపీకి బయలుదేరిన విద్యుత్‌ కార్మికులను కలసి మాట్లాడారు. వారిని ప్రత్యేక వాహనాల్లో పంపిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ నుంచి వచ్చిన విజ్ఞప్తి పట్ల ముఖ్యమంత్రి విజయ్‌ సానుకూలంగా స్పందించారని, తక్షణం ఉద్యోగులను పంపించాలని ఆదేశించారని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 07:02 AM