ఏపీలో వర్ష సూచన.. కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ABN , Publish Date - Oct 22 , 2026 | 09:09 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రాబోయే మూడు గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అమరావతి, అక్టోబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రాబోయే మూడు గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అమలాపురం, కట్రెనికోన ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు సూచిస్తున్నాయి.
బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా, కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
పిడుగులు, ఈదురుగాలుల వేళ అప్రమత్తంగా ఉండాలి..
ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్లు, గోడలు, హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, ఇతర శ్రామికులు, పశుకాపరులు పనులను నిలిపివేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వాతావరణ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దగ్గరపడింది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..