ఏపీ హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్ సత్యనారాయణ మూర్తి..!
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:27 AM
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సభ్యులుగా.. నరెళ్ల శ్రీనివాసరావు, జేవీ మనోహర్‌రెడ్డి
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్ మోషేన్ రాజు, హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్న ట్టు సమాచారం. సభ్యులుగా విశ్రాంత జడ్జి నరెళ్ల శ్రీనివాసరావు, జేవీ మనోహర్‌రెడ్డిని నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, జస్టిస్ సత్యనారాయణ మూర్తి 1960 జూన్ 14న మచిలీపట్నంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. అక్కడే ఆంధ్ర జాతీయ కళాశాలలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అనంతరం ఏపీ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని మచిలీపట్నంలో ప్రాక్టీస్ ప్రారంభించారు.
1991లో మచిలీపట్నం మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 1998లో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నుంచి ఎంఎన్ రావు గోల్డ్ మెడల్ అందుకున్నారు. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదోన్నతితో ఉమ్మడి హైకోర్టులో అదనపు జడ్జిగా 2013లో నియమితులయ్యారు. 2016 మార్చి 2న ఉమ్మడి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి, 2022 జూన్ 13న పదవీ విరమణ చేశారు. ఆయనసతీమణి ఎంవీ రమణ కుమారి న్యాయాధికారిగా, హైకోర్టు రిజిస్ట్రార్‌గా సేవలందించి పదవీ విరమణ చేశారు.
ఈ వార్తలనూ చదవండి: