Share News

జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డిలకు 3 రోల కస్టడీ

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:45 AM

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కడప సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిలను మూడు రోజులపాటు ఎక్సైజ్‌ పోలీసుల కస్టడీకి అప్పగించారు.

జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డిలకు 3 రోల కస్టడీ

  • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కోర్టు అనుమతి

ములకలచెరువు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కడప సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిలను మూడు రోజులపాటు ఎక్సైజ్‌ పోలీసుల కస్టడీకి అప్పగించారు. ఈ మేరకు మదనపల్లె ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి సుబహాన్‌ సోమవారం ఆదేశాలు ఇచ్చారు. నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి(ఏ17), గిరిధర్‌రెడ్డి(ఏ18) ఈ నెల 15వ తేదీన లొంగిపోవడంతో 28వ తేదీ వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. నిందితులను విచారించి కీలక సమాచారం రాబట్టేందుకు వారం రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎక్సైజ్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు విన్న కోర్టు మంగళవారం నుంచి గురువారం వరకు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇద్దరినీ మంగళవారం కడప సెంట్రల్‌ జైలు నుంచి మదనపల్లె ఎక్సైజ్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. మదనపల్లెకు తీసుకెళ్లాలా? లేదా కడపలోని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయానికి తరలించి విచారించాలా? అనేది ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 05:45 AM