Share News

రూ.30,156 కోట్లతో జలధార

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:07 AM

రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘జలజీవన్‌ మిషన్‌ 2.0- అమరజీవి జలధార’కు వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.

రూ.30,156 కోట్లతో   జలధార
jaladhara

  • రూ.30,156 కోట్లతో జలధార

  • 3.27 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు లబ్ధి

  • 27.36 లక్షల ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు

  • ప్రొద్దుటూరు వేదికగా నేడు ప్రారంభం

  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ హాజరు

  • రూ.280 కోట్లతో పులివెందుల మెగా వాటర్‌గ్రిడ్‌

  • 3.27 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు లబ్ధి

  • 27.36 లక్షల ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు

ప్రొద్దుటూరు వేదికగా నేడు ప్రారంభం

(కడప-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘జలజీవన్‌ మిషన్‌ 2.0- అమరజీవి జలధార’కు వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. రూ. 30,156.12 కోట్ల భారీ అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 50,315 పనులు చేపట్టే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రారంభిస్తారు. రాష్ట్ర గ్రామీణ తాగునీటి రంగంలోనే అతిపెద్ద మౌలిక వసతుల కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచే ఈ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వడంతో పాటు నీటిశుద్ధి కేంద్రాలు, రిజర్వాయర్లు, పైపులైన్లు, నీటి సరఫరా వ్యవస్థలను సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. అమరజీవి జలధారలో భాగంగా రాష్ట్రంలోని 24,601 జనావాసాల్లో 27.36 లక్షల కుటుంబాలకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. తద్వారా సుమారు 3.27 కోట్ల గ్రామీణ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది. సింగిల్‌ విలేజ్‌ స్కీమ్‌ (ఎస్‌వీఎస్‌), పునరుద్ధరణ పనులకు రూ.9,068.94 కోట్లు, 32 మల్టీ విలేజ్‌ స్కీమ్‌ (ఎంవీఎస్‌) ప్రాజెక్టులకు రూ.19,462.39 కోట్లు, నీటి నాణ్యత పర్యవేక్షణ, ఇతర కార్యకలాపాలకు రూ.1,624.79 కోట్లు చొప్పున కేటాయించారు. ఇప్పటికే 27,301 పనులు పూర్తయ్యాయి. వాటిపై రూ.5,587.01 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జలధారలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీస్థాయిలో నీటి మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. 1,426 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాలు, 14,995 నీటి నిల్వ నిర్మాణాలు, 77,243 కి.మీ. పైపులైన్లు నిర్మించనున్నారు.


ఏడు మండలాలకు జల భద్రత

ఏడు మండలాల పరిధిలో సుమారు 5.5 లక్షల మంది ప్రజలకు తాగునీటి భద్రత కల్పించే లక్ష్యంతో పులివెందుల మెగా వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును రూపొందించారు. ఇప్పటికే పులివెందుల, సింహాద్రిపురం ప్రాంతాల్లో ఈ పథకం ద్వారా నీటి సరఫరా అందుతోంది. మిగిలిన ప్రాంతాల్లోనూ పనులు పూర్తిచేసి త్వరలో పూర్తిస్థాయి సరఫరాకు సిద్ధం చేస్తున్నారు. హిరమండలం, పీఏబీఆర్‌, వెలుగోడు-ఓంకారం, ధవళేశ్వరం, తాండవ, ఏలేరు, గండికోట తదితర ప్రధాన జలాశయాలు, నీటి వనరులను ఆధారంగా చేసుకుని పలు భారీ నీటి సరఫరా ప్రాజెక్టులు చేపట్టనన్నారు. రూ.10,320 కోట్లతో 12 కీలక ఎంవీఎస్‌ ప్రాజెక్టులు చేపట్టి 7,126 జనావాసాల్లోని 88.68 లక్షల మంది జనాభాకు ప్రయోజనం కల్పించనున్నారు. మరోవైపు రూ.3,297 కోట్లతో 8,494 ఎస్‌వీఎస్‌ పనులు చేపట్టనున్నారు. రాయలసీమ ప్రాంతానికి మెగా వాటర్‌గ్రిడ్‌ తరహా ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. కడప జిల్లాలో పులివెందుల ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుండగా, రాష్ట్రస్థాయిలో జలధార కింద చేపట్టే భారీ నీటి సరఫరా వ్యవస్థలు పూర్తయితే నీటి ఎద్దడి ప్రాంతాలకు మరింత భరోసా ఏర్పడనుంది. వేసవిలో బోర్లు ఎండిపోవడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి రావడం వంటి సమస్యలకు పైపులైను ఆధారిత తాగునీటి పథకాలు పరిష్కారం చూపనున్నాయి.

జలధార వివరాలు ఇలా..

మొత్తం అంచనా వ్యయం 30,156.12 కోట్లు

చేపట్టే పనులు 50,315

ఇప్పటికే పూర్తయిన పనులు 27,301

ప్రయోజనం పొందే గ్రామీణ ప్రజలు 3.27 కోట్లు

జనావాసాలు 24,601

నీటి శుద్ధి సామర్థ్యం 1,426 ఎంఎల్‌డీ

నీటి నిల్వ నిర్మాణాలు 14,995

పైపులైను 77,243 కి.మీ.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 05 , 2026 | 04:08 AM