జగన్ రచ్చ ‘రాజ్యాంగం’!
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:05 AM
రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడుంది?’... ఇలాంటి ఒక సందేహాన్ని లేవనెత్తే వారు ఒకరొస్తారని రాజ్యాంగ నిర్మాతలు, నిపుణులు, మేధావులు ఊహించి ఉండరు...
రాజధాని ఉండాలని రాజ్యాంగంలో రాసుందా?
జగన్ ప్రశ్నలకు మేధావులే బెంబేలు
అన్నీ రాజ్యాంగంలో రాయరు సారూ...
ఆ స్ఫూర్తితో సంప్రదాయాలు, చట్టాలు
పార్లమెంటు చట్టాలూ రాజ్యాంగానికి లోబడే
రాష్ట్ర విభజన చట్టం, దానికి సవరణా.. అంతే!
అదీ అర్థంచేసుకోలేక జగన్ విచిత్ర విన్యాసాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడుంది?’... ఇలాంటి ఒక సందేహాన్ని లేవనెత్తే వారు ఒకరొస్తారని రాజ్యాంగ నిర్మాతలు, నిపుణులు, మేధావులు ఊహించి ఉండరు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 76 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్న సంధించారు. రాజ్యాంగం రూపొందించేందుకు అహోరాత్రులు శ్రమించి, పరిశోధించి, అధ్యయనం చేసిన నిపుణులే ఊహించని ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో రాయలేదు కదా... అని జగన్ ధర్మసందేహం వ్యక్తంచేశారు. నిజానికి... రాజ్యాంగంలో అన్ని విషయాలు ఉండవు. కానీ... రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నియమాలు, నిబంధనలు, చట్టాలు ఉంటాయి. వాటినే ప్రభుత్వాలు పాటిస్తాయి. కీలకమైన అంశాల్లో పార్లమెంటు ఏం చేయాలి, ఏం చేయకూడదో రాజ్యాంగం దిశానిర్ధేశం చేస్తుంది. అవి అమలవుతున్నాయా, లేదా అని కోర్టులు పరిశీలిస్తాయి. రాష్ట్రాలకు రాజధానులు కూడా రాజ్యాంగ మార్గదర్శకాలు, విధానాలు, సంప్రదాయాలు, అవసరాల మేరకే ఏర్పాటయ్యాయి. అందుకే... రాజ్యాంగంలో లేకుండానే రాజధాని ఎందుకు ఏర్పాటు చేశారని ఏ నేతా ప్రశ్నించలేదు. రాష్ట్ర రాజధానులు ‘రాజ్యాంగ విరుద్ధం’ అని వాదించనూ లేదు. స్వతంత్ర భారత చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఇలాంటి వాదనలు చేస్తున్నారు. ఏపీకి రాజధానిని ప్రకటించే హక్కు రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి లేదనుకుంటే... 2014లో తాను కడప ఎంపీగా ఉన్నప్పుడే ప్రశ్నించాల్సింది. లోక్‌సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఆ తర్వాత న్యాయపోరాటమూ చేయలేదు. రాష్ట్రానికి రాజధాని ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని నేడు ప్రశ్నిస్తున్న జగన్... నాడు ఏ రాజ్యాంగంలో రాసి ఉందని మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు? దీనికి సమాధానం లేదు. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇలా మూడు రాజధానులు లేవు. సంప్రదాయాలు, నియమాలను తోసి రాజని... మూడు ముక్కలాట మొదలుపెట్టారు. ఆయన అసలు ఉద్దేశం అమరావతిని అటకెక్కించడమే. వెరసి... ఆయన ఏదైనా చేయాలనుకుంటే రాజ్యాంగం పరిధిలోని చట్టాలను వాడుకుంటారు. తనకు నచ్చని పనులు ఎవరైనా చేస్తే... అలా చేయాలని రాజ్యాంగంలో రాసుందా అని ప్రశ్నిస్తారు.
నియమాలు, సంప్రదాయమే...
‘దేవుడికి పిజ్జా నైవేద్యంగా పెట్టొద్దని రాజ్యాంగంలో రాసుందా?’ అని అదేదో సినిమాలో నటుడు ప్రశ్నిస్తాడు. ‘నాయనా... అన్నీ రాజ్యాంగంలో రాసి ఉండవు. కొన్ని సంప్రదాయాలు, నియమాలను మనం పాటించాలి’ అని పూజారి వివరిస్తారు. ఇదే నిజం! పెళ్లి ఇలాగే చేసుకోవాలని రాజ్యాంగంలో రాసి ఉండదు. కానీ... పద్ధతులు, సంప్రదాయాలు ఉంటాయి. అవి రాజ్యాంగంలో లేనంత మాత్రాన చెల్లుబాటు కావని ఎవరైనా వాదిస్తే ఏం చెప్పగలం? పెళ్లి ఎలా జరిగినా, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చట్టబద్ధంగానే జరుగుతుంది. ఆ చట్టం రాజ్యాంగానికి లోబడే తయారైంది. రాజ్యాంగం, దాని పరిధిలో ఏర్పాటై చట్టాలు చేస్తున్న పార్లమెంట్ గురించి జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడి తన ‘ప్రతిభ’ను చాటుకుంటున్నారని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజ్యాంగం ప్రకారమే...
దేశంలోని అపర మేధావులు, రాజనీతిజ్ఞులు, సామాజిక వేత్తలు... ఇలా 284 మందితో రాజ్యాంగ సభ ఏర్పాటైంది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నేతృత్వంలో కమిటీ ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దేశానికి దిక్సూచిలాంటి రాజ్యాంగాన్ని తయారుచేసింది. కేంద్రం ఎలా ఉండాలి? రాష్ట్రం ఎలా ఉండాలి? కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి? అనే అంశాలపై స్పష్టమైన ఆర్టికల్స్‌ను పొందుపరిచారు. ఇలా రాజ్యాంగం ప్రకారమే కేంద్రానికి పార్లమెంటు, రాష్ట్రాలకు అసెంబ్లీలను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో కీలకమైన అంశాలపై చట్టాలు చేసే అధికారం రాజ్యాంగం పార్లమెంటుకు ప్రసాదించింది. అలాగే, రాష్ట్రాల స్థాయిలో చట్టాలు చేసుకునే అవకాశం శాసన వ్యవస్థకు ఇచ్చింది. కేంద్ర చట్టాలను తోసిరాజనేలా రాష్ట్ర చట్టాలు ఉండకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే చట్ట ప్రకారం రాష్ట్రాలకు రాజధానులు ఏర్పాటు చే సుకునే అధికారం దక్కింది. అయితే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి రాజ్యాంగమే ఇచ్చింది. దాని ప్రకారమే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నాటి యూపీఏ సర్కారు విభజించి, తెలంగాణను ఏర్పాటు చేసింది. ‘‘పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉంటుంది. ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి’’ అని ఆ చట్టంలో పేర్కొంది. ఇదంతా... రాజ్యాంగం తనకు ఇచ్చిన అధికారంతోనే కేంద్రం చేసింది. ఇప్పుడు... అదే చట్టాన్ని ‘ఏపీకి అమరావతి నూతన రాజధానిగా ఉంటుంది’ అని తాజాగా సవరించారు. ఇదీ రాజ్యాంగ బద్ధంగా జరిగిందే! ఈ విషయాన్ని జగన్‌కు తెలియదా? తెలిసీ... తెలియనట్లుగా మాట్లాడారా? ఒకవేళ కేంద్రం తప్పు చేస్తున్నట్లు ఆయన గట్టిగా భావిస్తుంటే... ఆ మాట బహిరంగంగా ఎందుకు చెప్పరు? ‘మోదీ సర్కారు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తోంది?’ అనే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు?
భలే భలే ‘మావిగన్’!
అదేదో సినిమాలో... ‘అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?’ అని ఒకరు ప్రశ్నిస్తే... ‘నాకు ఎలా వచ్చిందనేకంటే, మీకు రానందుకు సిగ్గుపడండి’ అని మరొకరు ఎదురు ప్రశ్నిస్తారు! ఇలా ఎవరికీ రాని ‘ఆలోచన’ జగన్‌కు వచ్చింది. అదే... మావిగన్! అమరావతిని అటకెక్కించి, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిన ఆయనే... ఇప్పుడు మచిలీపట్నం (మా), విజయవాడ (వి), గుంటూరు (గన్)లను కలిపి రాజధానిగా ప్రకటించాలని... దానికి ‘మావిగన్’ అని పేరు పెట్టాలని సూచించారు. తాను ప్రకటించిన కార్యనిర్వాహక రాజధాని విశాఖకు ఇది ప్లాన్-బి అంట! ఎప్పుడో 2014లో శివరామకృష్ణన్ కమిటీ ముందు చేయాల్సిన సూచనలను జగన్ ఇప్పుడు చేస్తుండటం గమనార్హం. పోనీ... తాను అధికారంలో ఉన్నప్పుడైనా ఇలా చేశారా, అంటే అదీ లేదు. అమరావతి పనులు జోరుగా సాగుతూ, రాజధాని రూపుదిద్దుకుంటున్న సమయంలో జగన్ తెరపైకి తెచ్చిన ‘మావిగన్’ బుధవారం సోషల్ మీడియాకు మాంచి సరుకుగా మారింది. రాష్ట్రంలోని మరిన్ని ఊర్లు, ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి, వెరైటీ సంక్షిప్త రూపాలను సృష్టించి... ‘ఈ పేరు పెడితే పోలా’ అంటూ తెగ ట్రోల్స్ చేశారు. ‘మావిగన్’ అనే ఒక్క మాటతో మొత్తం సోషల్ మీడియాను జగన్ షేక్ చేశారు.