Share News

పార్టీ అండగా ఉంటుంది!

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:00 AM

ఇటీవల మరణించిన వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు, లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్‌ పరామర్శించారు.

పార్టీ అండగా ఉంటుంది!

  • రాజశేఖర్‌ కుటుంబానికి జగన్‌ భరోసా

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇటీవల మరణించిన వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు, లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్‌ పరామర్శించారు. మంగళవారం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన.. ఒంగోలు ఏబీఎం గ్రౌండ్‌ హెలిప్యాడ్‌లో దిగారు. అక్కడి నుంచి కారులో స్థానిక క్లౌపేటలోని రాజశేఖర్‌ నివాసానికి చేరుకున్నారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. రాజశేఖర్‌ మృతి పార్టీకి తీరని లోటని.. ఆయన కుటుంబం ఒంటరిది కాదని, వైసీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం రాజశేఖర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పరిశీలకుడు ఆయోధ్యరామిరెడ్డి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

తీరు మారని వైసీపీ శ్రేణులు

తొడలు కొట్టడం.. చొక్కాలు విప్పి తిప్పడం.. జగన్‌ ఫొటోతో రోడ్లపై చిందులు వేయడం.. మృతుల కుటుంబాల పరామర్శలోనూ వైసీపీ శ్రేణులది అదే తీరు. వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ ఒంగోలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా జగన్‌ ఫొటోతో వైసీపీ శ్రేణు లు రోడ్డుపై చిందులు తొక్కుతూ, తొడలు కొడుతూ హంగామా సృష్టించాయి. కొందరు చొక్కాలు విప్పి గిరిగిరా తిప్పుతూ హల్‌చల్‌ చేశారు. మరోవైపు స్థానిక ఏబీఎం గ్రౌండ్‌లో హెలికాప్టర్‌ దిగిన తర్వాత జగన్‌ కారు డోరు వద్ద నిలబడి నమస్కరిస్తూ.. కిలోమీటరు దూరంలో ఉన్న రాజశేఖర్‌ ఇంటి వరకు ప్రయాణించారు.

-ఆంధ్రజ్యోతి, ఒంగోలు

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 06:00 AM