Share News

మాట తప్పరా.. మడమ తిప్పరా?

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:49 AM

‘మాట తప్పను.. మడమ తిప్పను’.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తన గురించి గొప్పగా చెప్పే మాట ఇది. ఇప్పుడు ఆయన తన మాట నిలబెట్టుకోవాల్సిన చిత్రమైన పరిస్థితి వచ్చింది.

మాట తప్పరా.. మడమ తిప్పరా?

  • 2029 ఎన్నికల్లో జగన్‌ ఏం చేస్తారు?

  • కూటమికి ‘ఏకగ్రీవాలు’ అయితే టికెట్‌

  • ఇవ్వనంటూ ఇన్‌చార్జ్‌లకు హెచ్చరిక

  • పులివెందుల్లోనే 20 వార్డులు ఏకగ్రీవం

  • మరి మీరు టికెట్‌ తీసుకోరా?

  • కడపలో ఏకంగా 50 వార్డులు

  • సోదరుడు అవినాశ్‌కూ ఇవ్వరా?

  • పెద్దిరెడ్డి, రోజా, మిథున్‌, బూచేపల్లి, గడికోట తదితరులకూ చుక్కెదురు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘మాట తప్పను.. మడమ తిప్పను’.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తన గురించి గొప్పగా చెప్పే మాట ఇది. ఇప్పుడు ఆయన తన మాట నిలబెట్టుకోవాల్సిన చిత్రమైన పరిస్థితి వచ్చింది. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా కూటమికి ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. ఏకగ్రీవం జరిగితే మిమ్మల్ని బాధ్యులను చేస్తా. నన్ను టికెట్‌ అడగనవసరం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఉండవు’ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో లోక్‌సభ, అసెంబ్లీ పార్టీ సమన్వయకర్తలను ఉద్దేశించి జగన్‌ గట్టిగా చెప్పారు. ఆయన ఒకటి తలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకటి జరిగింది. ఏకంగా జగన్‌ కంచుకోట, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకగ్రీవాలు అయ్యాయి.


జగన్‌ సొంత జిల్లా కడపలోనే ఆరు పురపాలక సంఘాలు/నగర పంచాయతీలు కూటమి వశమయ్యాయి. పుంగనూరులో ఇంతకాలం రాజకీయాలను శాసిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే చేతులెత్తేశారు. పుంగనూరు మున్సిపాలిటీని టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. నగరిలో రోజాకు, రాజంపేటలో ఎంపీ మిథున్‌రెడ్డికి, రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డికి, దర్శిలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వంటి నేతలకు ఇదే పరిస్థితి ఎదురైంది. వీరందరికీ జగన్‌ టికెట్లు ఇవ్వరా? ఇంకా బద్వేలు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు, కనిగిరి, గుత్తి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాలలోనూ కూటమి ఏకగ్రీవాలు చేసుకుంది.

అక్కడి వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి? వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూలత లేదు. దీంతో స్థానిక వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో చాలా చోట్ల నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదు. కొన్ని చోట్ల టికెట్లు ఇచ్చినా మాకొద్దంటూ పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే జగన్‌ మాత్రం కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 03:49 AM