Share News

ఏపీలో నేనూ కాక్రోచ్‌నే!

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:57 AM

ఏపీలో నేనూ కాక్రోచ్‌నే’ అని మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. యువత ఆకాంక్షలను నలిపివేస్తే రాష్ట్రంలోనూ బొద్దింకలు తయారవుతాయని, వాటిలో తాను కూడా ఒకడినవుతానని తెలిపారు

ఏపీలో నేనూ కాక్రోచ్‌నే!

డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరపాలి: జగన్‌

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో నేనూ కాక్రోచ్‌నే’ అని మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. యువత ఆకాంక్షలను నలిపివేస్తే రాష్ట్రంలోనూ బొద్దింకలు తయారవుతాయని, వాటిలో తాను కూడా ఒకడినవుతానని తెలిపారు. ‘జెన్‌జీ’ అన్నీ చూస్తోందనేది సీఎం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఎంపిక చేసిన కొద్దిమంది మీడియా ప్రతినిధులతో జగన్‌ ముచ్చటించారు. డీఎస్సీ-2025 నియామకాల్లో ఏం జరిగిందో నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలు దక్కని డీఎస్సీ అభ్యర్థుల తరఫున న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. తన హయాంలో 1,30,000 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను, ఒక్క ఆరోపణ కూడా లేకుండా, ఇవ్వడం ద్వారా రికార్డు సృష్టించామని తెలిపారు. మెగా డీఎస్సీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం భర్తీ చేసిన 16 వేల పోస్టుల్లో ఆరువేల టీచర్‌ పోస్టులకు తన హయాంలోనే నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. డీఎస్సీ ప్రశ్నాపత్రానికి సంబంధించిన కీలకబాధ్యతలను అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇవ్వడం....పరీక్షలు రాసి మెరిట్‌ తెచ్చుకున్నప్పటికీ, అక్కడ పనిచేసే ఓ ఉద్యోగికి పోస్టు ఇవ్వకపోవడం...డేటాను మార్పుచేయడం... డీఎస్సీ పేపర్‌ లీక్‌ అయిందనేందుకు నిదర్శనాలు కావా? అని జగన్‌ ప్రశ్నించారు. విలువిద్యలో జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడలిస్టు, గిరిజన అభ్యర్థి దుర్గయ్యకు మాత్రం అవకాశం ఇవ్వలేదని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనతో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. స్కామ్‌లు మాత్రం అడ్డూఆపూ లేకుండా సాగిపోతున్నాయని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపడతామని, డీఎస్సీ అంశాన్ని కూడా అందులో భాగం చేసి మాట్లాడతామని వెల్లడించారు. కాగా, సాధారణంగా ‘ప్రెస్‌మీట్‌’ను జగన్‌ మూడు గంటలకు తక్కువ నిర్వహించరు. అలాంటిది తొలిసారి గతానికి భిన్నంగా, తన ప్రసంగాన్ని ఉదయం 11.14 గంటలకు ప్రారంభించి 12.45 గంటలకు ముగించారు.

Updated Date - Jun 12 , 2026 | 04:57 AM