ఎస్‌ఈసీ పునేఠా తీవ్రవాది
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:21 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తీవ్రవాదిలా వ్యవహరిస్తారంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో పోలీసులే గూండాల్లా ప్రవర్తించారని ఆరోపించారు.
ఎస్‌ఈసీ పునేఠా తీవ్రవాది
పోలీసు వ్యవస్థనూ గుర్తు పెట్టుకుంటాం
ఎన్నికల వ్యవస్థను సంస్కరించాలి: జగన్
అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తీవ్రవాదిలా వ్యవహరిస్తారంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో పోలీసులే గూండాల్లా ప్రవర్తించారని ఆరోపించారు. శాంతిభద్రతల కోసం గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపితే.. వైసీపీ నేతలపై కాల్పులు జరిపారంటూ జగన్ విమర్శలు చేశారు. ఆదివారం సానుకూల మీడియాతో ఆయన గంటా 12నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. తమకు కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లో, తనకూ, తన కుటుంబ సభ్యులకూ, తన అనుచరగణానికీ మాత్రమే నామినేషన్లు వేసే హక్కు ఉందని భావిస్తూ వచ్చిన ప్రాంతాల్లో గట్టి పోటీ ఎదురు కావడంతో కూటమిపై అక్కసు వెళ్లగక్కారు. మీడియా సమావేశం పేరిట ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ, అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసు వ్యవస్థనూ గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఒక విస్తరణాధికారిలా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కోసం సేవకుడిలా పనిచేసే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించినప్పుడే 2021లో ప్రజాబలాన్ని చూరగొన్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం తీవ్రవాదిలా పనిచేసే పునేఠా ఎస్‌ఈసీగా విధులు నిర్వహిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలిసిందేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ నాయకులు, సహకరించిన అధికారులు, పోలీసుల వీడియోలు తమవద్ద ఉన్నాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ సాక్ష్యాల ద్వారా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రమంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో రక్తపాతం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవస్థను సంస్కరించాల్సి ఉందని జగన్ అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేతతో కూడిన కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని నియమించే సంప్రదాయాన్ని అమలు చేయాలని అన్నారు. పునేఠాను తీవ్రవాదిగా విమర్శించిన కొద్ది సేపటికే ఆయనతో జగన్ సమావేశమై, వైసీపీ అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని కోరారు.
కథ అడ్డం తిరగడంతో..:
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై నాటి సీఎం జగన్ ప్రత్యేక ఫోక్‌సను పెట్టారు. టీడీపీ తరఫున అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు దాడులు చేశారు. ఇప్పుడు పులివెందులలో ప్రతికూలత ఎదురుకావడంతో జగన్ తట్టుకోలేకపోతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి వంటి నేతలున్న చోట గట్టి పోటీ ఎదురుకావడం, పలుచోట్ల సొంత పార్టీ అభ్యర్థులు పోటీకి విముఖత చూపడం, తమ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోవడాన్ని జగన్ అవమానంగా భావిస్తున్నారని అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులు నామినేషన్ కూడా వేయకుండా వైసీపీ నేతలు దౌర్జన్యకాండ చేశారు. నామినేషన్లు వేయడానికి వచ్చినవారి నుంచి పత్రాలు లాక్కొని చించేశారు. ఇప్పుడు అధికారంలో లేకున్నా దాడులకు తెగబడుతున్నారు. పులివెందులలో అయితే ఏకంగా పోలీసులపైనే రాళ్లు రువ్వారు. నాడు జరిగిన అరాచకాలను అప్పట్లో సమర్థించుకున్నారు. ఇప్పుడు పోలీసులపైనే వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నా జగన్ మాత్రం ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు.
వైసీపీ నామినేషన్లను పోలీసులే చించేశారు
సీఎం చంద్రబాబులాంటి వారి వల్లే కాక్రోచ్‌లు పుట్టుకొస్తాయని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలసి జగన్ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసులే వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల నాటికి ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళనను గవర్నర్ వద్ద వ్యక్తం చేశామన్నారు.
పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపాలని కోరామన్నారు. నామినేషన్లను తిరస్కరిస్తే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియను తేవాలని గవర్నర్‌ను కోరామన్నారు. బ్యాలెట్ బాక్సులను మార్చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడు, ప్రజల ఆగ్రహంతో 2029లో చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు పడిపోతారని జగన్ శపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి