Share News

రెండు నాల్కల జగన్‌!

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:49 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తమ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై వైసీపీ నేతల నుంచే నిరసన వ్యక్తమవుతోంది. ఒకవైపు ‘సర్‌’ ప్రక్రియ పూర్తయ్యేదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవాలంటూ వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

రెండు నాల్కల జగన్‌!

  • బీసీ కోటాపై సుప్రీంకోర్టు నిర్ణయం రాలేదు

  • స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లూ ఖరారు కాలేదు

  • నెల్లూరు మేయర్‌ సీటు ఎవరికి వెళ్తుందో తెలియదు

  • అయినా వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరు ప్రకటన

  • జగన్‌ ఏకపక్ష నిర్ణయంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తమ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై వైసీపీ నేతల నుంచే నిరసన వ్యక్తమవుతోంది. ఒకవైపు ‘సర్‌’ ప్రక్రియ పూర్తయ్యేదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవాలంటూ వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. మరోవైపు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ తెచ్చిన జీవోలను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడలేదు. ఈ రెండంశాల్లో తుది నిర్ణయం రాకుండానే.. నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని జగన్‌ ప్రకటించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయన రెండు నాల్కల ధోరణి రాజకీయంగా బూమరాంగ్‌ అవుతుందని వైసీపీ నేతలే వాపోతున్నారు. రాష్ట్రంలో అధికార కూటమితో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నీ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఒకవైపు.. తానొక్కడినే మరోవైపు అన్నట్లుగా జగన్‌ ‘రివర్స్‌’ నిర్ణయాలను ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని సొంత పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. వాస్తవానికి జగన్‌ తీరును నిరసిస్తూ ఇప్పటికే ద్వితీయశ్రేణి నేతలు వైసీపీని మూకుమ్మడిగా వీడుతున్నారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పరువు దక్కించుకునేందుకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన జగన్‌.. నియంతలా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ముఖ్యనేతలు కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో నెల్లూరు జిల్లా నేతలు జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర మేయర్‌ అభ్యర్థిగా విజయకుమార్‌రెడ్డి పేరును ప్రకటించారు.


సార్వత్రిక ఎన్నికలు వేరు.. స్థానిక సంస్థల ప్రక్రియ వేరు!

సార్వత్రిక ఎన్నికలు వేరు.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేరని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకసారి రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ) ఖరారైతే.. మళ్లీ నియోజకవర్గ పునర్విభజన జరిగేదాకా అవే అమల్లో ఉంటాయి. కానీ స్థానిక ఎన్నికల్లో.. వార్డులు, డివిజన్లు, సర్పంచ్‌లు, చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్‌ రోస్టర్‌ ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ రోస్టర్‌ ఖరారయ్యేదాకా ఆగాల్సిందే. ఇవేమీ పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్‌పై డిమాండ్‌ నెలకొన్న సమయంలో నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా అగ్రకులానికి చెందిన విజయకుమార్‌రెడ్డిని జగన్‌ ప్రకటించడం ఏమిటని వైసీపీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజకీయంగా వివేకంతో ఆలోచిస్తే.. అభ్యర్థిగా ఎస్సీ/ఎస్టీ నేతను ప్రకటించి ఉంటే.. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యా తలెత్తదని.. ఒకవేళ నెల్లూరు మేయర్‌ జనరల్‌ కేటగిరీలోకి వెళ్తే.. ఎస్సీ/ఎస్టీని నిలిపితే.. రాజకీయంగానూ కలిసివచ్చేదని వైసీపీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల అభ్యర్థులపై అందరితో చర్చించాకే.. ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని ఇటీవల పార్టీ నేతల సమావేశంలో జగన్‌ ఆదేశించారని.. కానీ నెల్లూరు మేయర్‌ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడం ద్వారా దీనిని ఆయనే పాటించలేదని అంటున్నారు.


బీసీలపై చెప్పేదొకటి.. చేసేదొకటి..

జగన్‌ చెప్పేదెప్పుడూ చేయరని ఆ పార్టీ ముఖ్య నేతలు బహిరంగంగానే చెబుతుంటారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ కాస్ట్‌ కాదని.. బ్యాక్‌బోన్‌ అని ఆర్భాటంగా చెప్పి.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో కీలక పదవులన్నీ ఆయన తన సామాజికవర్గానికే కట్టబెట్టుకున్నారన్న విమర్శలున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా మారలేదు. ఆయన కోటరీలో ఒక సామాజికవర్గానికే పెద్దపీట. ఇప్పుడు రాజకీయంగా వెనుకబడినవర్గాలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న డిమాండ్‌ వెల్లువెత్తుతున్న తరుణంలో.. నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని ప్రకటించడం ద్వారా వ్యతిరేకత కొని తెచ్చుకున్నట్లయిందని వైసీపీ నేతలు అంటున్నారు. బీసీలకు 34 శాతం కోటాకు వ్యతిరేకంగా వైసీపీ మద్దతుదారులే పిటిషన్లు వేశారన్న ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ‘సర్‌’ ప్రక్రియ పూర్తయ్యేదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్వయంగా హైకోర్టుకు వెళ్లారు. కుదరదంటూ కోర్టు కొట్టివేయడంతో వైసీపీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి ఒకవైపు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ.. రిజర్వేషన్లు ఖరారు కాకముందే నెల్లూరు మేయర్‌ అభ్యర్థిని ప్రకటించడం పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బేనని ఆ పార్టీ ముఖ్యనేతలు కొందరు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ నెల్లూరు మేయర్‌ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తే.. తాము ముందస్తుగా రెడ్డి సామాజికవర్గ నేతను ప్రకటించినందునే.. రిజర్వేషన్‌ మార్చేశారంటూ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలన్న ఆలోచన జగన్‌కు ఉండిఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 05:58 AM