Share News

చివరి ఎకరా దాకా సాగునీరు!

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:37 AM

చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఈ ఏడాది నవంబరు నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులన్నీ వచ్చినందున త్వరితగతిన పనులు మొదలుపెట్టాలని జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

చివరి ఎకరా దాకా సాగునీరు!

  • వచ్చేనెల నుంచి తిరిగి ‘చింతలపూడి’ పనులు

  • నిర్వాసితులకు పరిహారం చెల్లించండి

  • విశాఖ మంచినీటి, పారిశ్రామిక అవసరాలకు ప్రత్యేక కార్యాచరణ

  • స్థానిక ఎన్నికల పనుల్లో తలమునకలవుతూనే.. జలవనరుల శాఖపై చంద్రబాబు సమీక్ష

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఈ ఏడాది నవంబరు నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులన్నీ వచ్చినందున త్వరితగతిన పనులు మొదలుపెట్టాలని జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జలవనరుల సమర్థ నిర్వహణ, నదుల అనుసంధానమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

రాష్ట్రంలో గుర్తించిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, 2028 డిసెంబరు నాటికి అన్ని ప్రాజెక్టులనూ అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు, ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జల హారతి కార్పొరేషన్‌ ద్వారా జల వనరుల శాఖకు ఆదాయాన్ని సమకూర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలవరం నిర్వాసితులకు చెల్లింపులు చేయాలని ఆదేశించారు.


పోలవరం కాలువల ద్వారా నేవిగేషన్‌ వ్యవస్థ

పోలవరం నిర్మాణంలో సాంకేతిక అంశాల పట్ల ఎలాంటి రాజీ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు 90.2 శాతం సివిల్‌ పనులు పూర్తి అయినట్టు అధికారులు సీఎంకు వివరించారు. నిపుణుల కమిటీ పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి- పెన్నా అనుసంధానంపై కార్యాచరణ ప్రారంభించాలని, గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తరలించే దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువన, దిగువన వైకుంఠపురం, చోడవరం వద్ద ఆనకట్టల నిర్మాణం ద్వారా 14 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాలన్నీ క్రియాశీలంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలువల వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు, భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు అంతర్గత జల రవాణాకు అవసరమైన నావిగేషన్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.


జలధార-జలహారతి నిరంతర కార్యక్రమం

జలధార-జలహారతి రెండో దశ పనులను వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగిస్తూ, 150 రోజుల కార్యక్రమంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ‘వీబీజీ రామ్‌ జీ’తో అనుసంధానం చేసి పనులు చేపట్టాలన్నారు. 2027 ఏప్రిల్‌ 1 నుంచి మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. భూగర్భ జలమట్టాలను 3 మీటర్లకు పైగా పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టాలన్నారు. జలధార- జల హారతిని నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తూ, వర్షపు నీటిని ఒడిసి పట్టాలని, చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను పెంచాలని చెప్పారు. రాష్ట్రంలోని కాలువలపై సౌర విద్యుత్‌ ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించు కోవాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టి కాలువల నిర్వహణను మెరుగుపరచాలని, పూడిక తొలగించి చిట్ట చివరి ఎకరాకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విశాఖ మంచినీరు, పారిశ్రామికావసరాలను తీర్చేందుకు వీలుగా రిజర్వాయర్ల నిర్మాణం, గోదావరి జలాలు తరలింపుపై ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తత

బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ రిజర్వాయర్లు, చెరువులను నింపాలని సూచించారు. వరద నిర్వహణ, నీటి నిర్వహణ, విపత్తుల నిర్వహణపై సమగ్ర కార్యాచరణ అమలు చేయాలన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవడం, సాగునీటి వనరులను సమర్థంగా నిర్వహించడం ద్వారా రైతులకు గరిష్ఠ ప్రయోజనం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 06:38 AM