పెళ్లి పేరుతో యువతికి మోసం
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:47 AM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేయడమే కాకుండా మతం మారాలని ఒత్తిడి చేశాడో ప్రబుద్ధుడు. ఆమె అంగీకరించక పోవడంతో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు.
మతం మారాలంటూ ఒత్తిడి.. వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్
హైదరాబాద్ యువకుడికి రిమాండ్
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు2 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేయడమే కాకుండా మతం మారాలని ఒత్తిడి చేశాడో ప్రబుద్ధుడు. ఆమె అంగీకరించక పోవడంతో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. విసిగిపోయిన బాధితురాలు.. ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌కు చెందిన నిందితుడిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రామకిశోర్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి.. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ యువతి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రయీద్ ఖాద్రి (24)తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లి విషయం ఎప్పుడు ప్రస్తావించినా దాటవేస్తూ వచ్చాడు. ఇటీవల అతడిని తిరుపతిలోని ఓ హోటల్‌కు పిలిపించి పెళ్లి విషయమై ఆమె నిలదీయగా.. తన మతంలోకి మారాలని ఒత్తిడి చేశాడు. అందుకామె అంగీకరించక పోవడంతో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, బంధువులకు పంపుతానని బెదిరించాడు.
దీనిపై బాధితురాలు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ శ్రీవాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపారు. నిందితుడిని ఈనెల ఒకటో తేదీన మలక్‌పేట అక్బర్‌బాగ్‌లోని అతడి నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తిరుపతికి తీసుకొచ్చి విచారించారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని సాంకేతిక ఆధారాలను పరిశీలించి దర్యాప్తు కొనసాగించనున్నట్టు సీఐ వెల్లడించారు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు