పరిమళించిన మానవత్వం
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:17 AM
‘‘మానవుడే మహనీయుడు.. మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే..’’ అంటూ అప్పుడెప్పుడో ఓ సినీగేయ రచయిత మనుషుల గొప్పతనాన్ని వివరిస్తూ ఓ పాట రాశారు.
కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికకు ప్రజల ఆపన్నహస్తం
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో స్పందించిన హృదయాలు
రూ.10 కోట్ల వరకు క్రౌడ్ ఫండింగ్
ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు
రూ.16 కోట్ల ఇంజెక్షన్‌తో చిన్నారి బతికే అవకాశం
మిగిలిన 6 కోట్ల కోసం లోకేశ్‌కు తల్లిదండ్రుల విజ్ఞప్తి
ఆ డబ్బు సమకూర్చే బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ
కర్నూలు/వెల్దుర్తి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘మానవుడే మహనీయుడు.. మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే..’’ అంటూ అప్పుడెప్పుడో ఓ సినీగేయ రచయిత మనుషుల గొప్పతనాన్ని వివరిస్తూ ఓ పాట రాశారు. అది సమాజంలో ఏదో రూపంలో ఎన్నోసార్లు కనిపిస్తూనే ఉంటుంది. కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికశ్రీ విషయంలోనూ మరోసారి ప్రస్ఫుటమైంది. 14 నెలల చిన్నారికి ప్రాణాంతకమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) అనే జన్యుపరమైన వ్యాధి సోకిందని తెలిసి ప్రజలంతా తల్లడిల్లిపోయారు. రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయిస్తే చిన్నారి కలకాలం క్షేమంగా ఉంటుందని తెలిసి చేయి చేయి కలిపారు. తమకు తోచిన సాయం చేసి రూ.10కోట్ల వరకు ఆ చిన్నారి తల్లిదండ్రులకు అందించారు. మరోపక్క ప్రధాన మంత్రి రిలీఫ్ పండ్ (పీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.50లక్షలు మంజూరయ్యాయి. దీంతో తమ కుమార్తెను బతికించుకుంటామనే ఆశలు ఆ పేద దంపతుల్లో చిగురించాయి. మరో రూ.6కోట్లు అవసరం ఉంటుందని, ప్రభుత్వం సాయం చేయాలని తల్లిదండ్రులు విన్నవిస్తున్నారు. మరో వారం పది రోజుల్లో చికిత్స చేపడతామని వైద్యులు చెప్పినట్లు పునర్వికశ్రీ తండ్రి సురేశ్ బుధవారం ఆంధ్రజ్యోతికి వివరించారు.
అది సాధారణ జబ్బు కాదు..
కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జంపాల మంగలి సురేశ్ కుమార్, పుష్పావతి దంపతులకు కుమారుడు, కూతురు ఇద్దరు సంతానం. వారిది మేనరిక వివాహం. కుమార్తె పునర్వికశ్రీ 2025 మే 12న జన్మించింది. పుట్టినప్పుడు 3.5 కిలోల బరువు ఉన్న ఆ చిన్నారి నాలుగైదు నెలలు నిండినా శరీరాన్ని కదలించకపోవడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆరు నెలల చిన్నారిని హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆ పాపకు అరుదైన వ్యాధి ఎస్‌ఎంఏ సోకిందని తెలిపారు. ఈ వ్యాధి వెన్నెముకలోని కణాలను దెబ్బతీసి కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుందని చెప్పారు. దీనివల్ల నడవడానికి కష్టం అవుతుందని, ఒకేసారి ఇచ్చే జోన్‌మెన్‌స్మా ఇంజెక్షన్‌తో నయం చేయవచ్చని చెప్పారు. ఆ ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు ఉంటుందని వైద్యులు చెప్పడంతో ఆ పేద తల్లిదండ్రులు ఒక్కసారి కుంగిపోయారు. దాతల సాయం కోసం ఎదురు చూశారు. ఆ కన్నవాళ్ల ఆవేదనను గతేడాది డిసెంబరు 10న ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో ‘పునర్వికకు పునర్జన్మనివ్వరూ..!’ శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో వారి ఆవేదన వెలుగులోకి వచ్చింది. ఆ కథనంతో రాష్ట్రం నుంచేగాక పొరుగు రాష్ట్రాల్లోని మానవతా మూర్తులు స్పందించారు.
చేయి చేయి కలిపి..
దాతల సాయంతో పాటుగా ఇంజెక్షన్ తయారీ కంపెనీ వారి లక్కీడ్రా ద్వారా, క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా సాయం పొందవచ్చని తెలుసుకున్న సురేశ్ కుమార్.. ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ సంస్థను ఆశ్రయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సాయం చేయాలని అభ్యర్థించారు. విశాఖలో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కూడా తన కూతురి పరిస్థితి వివరిస్తూ సాయం కోరారు. సోషల్ మీడియాలో నూ చాలామంది స్పందించారు. మానవత్వంతో స్పందించి డబ్బులు సేకరించారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ బైరెడ్డి శబరి సిఫారసుతో పీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. చిన్నారికి అవసరమైన చికిత్స, ఇంజెక్షన్ కోసం హైదరాబాద్‌లోని రెయిన్‌బో వైద్యులను కలిశానని, దాతల ద్వారా వచ్చిన మొత్తం, పీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన నిధుల గురించి వైద్యులకు వివరించానని చిన్నారి తండ్రి సురేశ్ తెలిపారు. వైద్య బృందంతో చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్ తెప్పించడంపై వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెప్పారన్నారు.
అండగా ఉంటా: లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పునర్వికను ఆదుకునేందుకు మంత్రి లోకేశ్ ముందుకొచ్చారు. ఎస్‌ఎంఏ టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని రక్షించుకునేందుకు తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తితో దాతలు ఇప్పటికే రూ. 10 కోట్లను సమకూర్చారు. మరో రూ.6 కోట్లు తక్కువ కావడంతో పునర్విక తల్లిదండ్రులు లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. తమ చిన్నారిని ఆదుకోవాలని కోరారు. స్పందించిన లోకేశ్ పునర్వికను ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని, మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.