Share News

సెక్షన్‌ 147ఏ రాజ్యాంగ విరుద్ధం

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:57 AM

ఆదాయ పన్ను పునఃమదింపు, నోటీసులు జారీచేసే అధికారాన్ని స్థానిక జేఏవోలకు కల్పిస్తూ ఆదాయపు పన్ను చట్టం-1961లో సెక్షన్‌ 147ఏ చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెక్షన్‌ 147ఏను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ...

సెక్షన్‌ 147ఏ రాజ్యాంగ విరుద్ధం

  • ఆదాయపు పన్ను చట్టంలో దానిని చేర్చడం సరికాదు

  • హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఆదాయ పన్ను పునఃమదింపు, నోటీసులు జారీచేసే అధికారాన్ని స్థానిక జేఏవోలకు కల్పిస్తూ ఆదాయపు పన్ను చట్టం-1961లో సెక్షన్‌ 147ఏ చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెక్షన్‌ 147ఏను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ... దానిని రద్దు చేసింది. ఆదాయపు పన్ను మదింపు, నోటీసుల జారీ ప్రక్రియను పూర్తిగా ఎలక్ట్రానిక్‌ పద్ధతి, ఫేస్‌లెస్‌ విధానంలోకి మారుస్తూ చట్టంలో మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేసింది. దానిని మార్చకుండా సెక్షన్‌ 147ఏ కింద స్థానిక అధికారులకు నోటీసులు జారీచేసే అధికారం కట్టబెట్టడం చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. సెక్షన్‌ 147(ఏ)కి అనుగుణంగా జేవోలు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ చెల్లుబాటు కావని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ టీసీ ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.

ఫైనాన్స్‌ చట్టం-2026 ద్వారా ఆదాయపు పన్ను చట్టం1961లో సెక్షన్‌ 147ఏను చేర్చడం ద్వారా పన్ను పునఃమదింపు, నోటీసులు జారీ చేసే అధికారాన్ని స్థానిక అధికారులకు కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ధర్మాసనం ఈ వ్యాజ్యాలంటినీ కలిపి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ‘పన్ను చెల్లించేవారికి, అధికారులకు మధ్య ప్రత్యక్ష సంబంధం లేకుండా ఎలక్ట్రానిక్‌ పద్దతిలో ఆదాయపు పన్ను మదింపు చేసేందుకు చట్టంలో సెక్షన్‌ 151ఏ చేర్చారు. సెక్షన్‌ 147 కింద పన్ను పునఃమదింపు, సెక్షన్‌ 148 కింద నోటీసులు జారీ పూర్తిగా ఆటోమేటేడ్‌ పద్ధతిలో, ఫేస్‌లెస్‌ విధానంలో జరగాలి. అయితే స్థానిక అధికారులు(జేఏవోలు) నిబంధనలకు విరుద్ధంగా నేరుగా నోటీసులు జారీ చేశారు.


వీటిని సవాల్‌ చేస్తూ పన్ను చెల్లింపుదారులు గతంలో హైకోర్టును ఆశ్రయించగా నేరుగా నోటీసులు జారీచేసే అధికారం జేఏవోలకు లేదని స్పష్టం చేసింది. అయితే జేఏవోలకు పన్ను పునఃమదింపు చేసి, నోటీసులు జారీ చేసే అధికారాలు కల్పించేందుకు వీలుగా ఆదాయపు పన్ను చట్టం 1961కి సవరణ చేస్తూ కేంద్రం సెక్షన్‌ 147ఏని చేర్చింది. 2021 ఏప్రిల్‌ నుంచి (రెట్రోస్పెక్టివ్‌) సెక్షన్‌ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం’ అని వాదించారు.

తీర్పులో ఏముందంటే...

పిటిషనర్ల వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పార్లమెంట్‌కు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ... లోపాలను సవరించకుండా కేవలం కోర్టు తీర్పులను అధిగమించేందుకు చట్టాలకు సవరణలు తేవడం చెల్లదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగంలోని అధికార విభజన సిద్ధాంతాన్ని ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. ఆదాయపన్ను చట్టం-1961.. 2026 మార్చి 31 అర్ధరాత్రితో రద్దయినందున....అందులో కొత్తగా సెక్షన్‌ 147ఏని చేర్చడం సాధ్యం కాదని పేర్కొంది. సెక్షన్‌ 147ఏను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ.. రద్దు చేసింది. స్థానిక జేఏవోలకు పన్ను పునఃమదింపు చేసి నోటీసులు జారీ చేసే అధికార పరిధి లేదని స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:57 AM