మఠం భూములు ముఠాల పాలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:38 AM
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే శిక్షార్హులు’ అంటూ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టడం పరిపాటి. తిరుపతిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి, భోజనం ఏర్పాటు.. దీంతో పాటు గో సేవ కోసం తిరుపతిలో హథీరాంజీ మఠం ఏర్పాటు చేశారు. ఇందుకోసం భక్తులు పెద్ద ఎత్తున భూములు విరాళంగా ఇచ్చారు. ఇదంతా గతం. ప్రస్తుతం హథీరాంజీ మఠం దేవదాయ శాఖ పరిధిలో ఉంది. భక్తుల సేవల కోసం నాడు దాతలు ఇచ్చిన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వేల కోట్ల రూపాయల విలువైన వందలాది ఎకరాలను కబ్జా చేసేశారు. ప్లాట్లు వేసి స్థలాలు విక్రయించడంతో పాటు అనుమతులు లేకుండా భారీ భవనాలను నిర్మిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మొదలైన మఠం భూముల కబ్జా పర్వం కూటమి ప్రభుత్వం వచ్చాకా అదే స్థాయిలో సాగుతోంది.
వేల కోట్ల ‘హథీరాంజీ’ భూములు పరాధీనం
హెచ్చరిక బోర్డులు పెట్టి మరీ ఆక్రమణలు
ప్రహరీలు కట్టి లోపల అక్రమ నిర్మాణాలు
తిరుపతిలో బహిరంగంగా భూముల కబ్జా
అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు
బైరాగిపట్టెడలో రూ.300 కోట్ల భూములు స్వాహా
కారు చౌకగా కొన్నవారిలో పోలీసు అధికారులూ
అవిలాలలోనూ 400 కోట్ల విలువైన భూములు
గత ప్రభుత్వంలో మొదలైన అక్రమాలు అదే స్థాయిలో
కాపాడలేక చేతులెత్తేసిన అధికార యంత్రాంగం
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
‘ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే శిక్షార్హులు’ అంటూ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టడం పరిపాటి. తిరుపతిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి. అక్రమార్కులే అధికారులకు హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. అత్యంత ఖరీదైన స్వామి శ్రీ హథీరాంజీ మఠం భూములను ఆక్రమించి మరీ.. ‘అనుమతి లేనిదే ఎవరూ లోనికి ప్రవేశించరాదు’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఎకరాల కొద్దీ కబ్జా చేసిన మఠం భూముల చుట్టూ ప్రహరీలు కట్టేసి, లోపల అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ స్టాంపు పేపర్ల మీదే అనధికారిక విక్రయాలు జరిగిపోతున్నాయి. స్థానిక సంస్థల అనుమతులు లేకుండానే, కన్వర్షన్ జరగకుండానే నిర్మాణాలు వెలుస్తున్నాయి. మఠం భూములను ఆక్రమించిన వారు వాటిని కాపాడుకునేందుకు పలువురు పోలీసు అధికారులకు కారుచౌకగా స్థలాలు విక్రయించారు. మరోవైపు ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నేతలూ కబ్జాదారుల నుంచి రూ.కోట్లు దండుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ కబ్జా బాగోతం మొదలైంది. కూటమి ప్రభుత్వంలోనూ ఆగడం లేదు. ఫలితంగా న్యాయపరమైన చిక్కులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు...

బైరాగిపట్టెడలో యథేచ్ఛగా నిర్మాణాలు
తిరుపతి బైరాగిపట్టెడ సర్వే నంబరు 242-బీలో 9.89 ఎకరాల భూమి చుట్టూ ఎత్తైన ప్రహరీ కట్టారు. ప్రవేశ మార్గం వద్ద ‘అనుమతి లేకుండా లోపలికి ప్రవేశిస్తే హైకోర్టు ఉత్తర్వుల మేరకు శిక్షార్హులు’ అని హెచ్చరిస్తూ బోర్డులు పెట్టారు. ప్రహరీ లోపల భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. వాటికి తుడా అనుమతులు లేవు. హథీరాంజీ మఠానికి చెందిన ఈ భూముల విలువ రూ.300 కోట్లు.
ఈ భూములు మఠానివేనని...
సర్వే 242లో మొత్తం విస్తీర్ణం 11.63 ఎకరాలు. 1880 సెప్టెంబరు 21న అప్పటి మద్రాసు ఇనామ్ కమిషనర్ ఈ భూమి హథీరాంజీ మఠానిదే అంటూ టైటిల్ డీడ్ జారీ చేశారు. తర్వాత ఈ భూమిని 242-ఏలో 1.74 ఎకరాలు, 242-బీలో 9.86 ఎకరాలు చొప్పున సబ్ డివిజన్ చేశారు. 1956లో ఇనాం అబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చాక విచారణ జరిపారు. ఈ భూమి మఠానిదేనంటూ 1959 నవంబరు 9న అప్పటి చంద్రగిరి ఇనాం డీటీ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. 1960 జనవరి 21న మఠం పేరిట రైత్వారీ పట్టాలు కూడా జారీ అయ్యాయి. తర్వాత సర్వే నంబరు 242-బీలోని 9.86 ఎకరాల్లో 5.73 ఎకరాలను మఠం మహంతు ఒకరికి లీజుకిచ్చారు. ఆ భూమిలో వ్యవసాయం మాత్రమే చేయాల్సి ఉండ గా లీజుదారు కుటుంబీకులు ప్లాట్లు వేసి విల్లా తరహా నిర్మాణాలు చేపట్టారు.
స్టేటస్ కో విధించినా..
2024 ఫిబ్రవరిలో అక్రమ నిర్మాణాలు ఆపాల్సిందిగా మఠం అధికారులు నోటీసులు ఇవ్వడంతో, నిర్మాణదారులు హైకోరుకు వెళ్లారు. 242-బీ సర్వే లో మిగిలిన 4.16 ఎకరాల మఠం భూమిని మరో ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిపై తమకు హక్కుందంటూ కొందరు వ్యక్తులు హైకోర్టులో 3174-2024, 3705-2024 నంబర్లతో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల్లో హైకోర్టు స్టేటస్ కో జారీ చేసింది. అయినా భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగిపోతున్నాయి. కబ్జాదారులు ఈ భూములను కాపాడుకునేందుకు పలువురు పోలీసు అధికారులకు కారు చౌకగా స్థలాలు విక్రయించినట్టు సమాచారం. బినామీ పేర్లతో కొన్న పోలీసు అధికారులు భారీ భవంతులు నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

అవిలాలలో అక్రమాలు
తిరుపతి రూరల్ మండలం అవిలాలలో రూ.400 కోట్ల విలువైన హథీరాంజీ మఠం భూములు పరాధీనమవుతున్నాయి. సర్వే నంబరు 145లో 7.70 ఎకరాల మఠం భూమిలో 1.14 ఎకరాలు ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకుని సానప్ప కాలనీలో ఎస్సీ, ఎస్టీలకు పక్కా ఇళ్ల కోసం కేటాయించింది. దానికి మఠానికి పరిహారం కూడా చెల్లించింది. మిగిలిన 6.56 ఎకరాల్లో మైసూరుకు చెందిన పరకాల మఠం భూమి 4.97 ఎకరాలు ఉంది. ఈ భూమి నిర్వహణ హథీరాంజీ మఠమే చూసేది. ఈ భూమిని 1999లో పరకాల మఠం, హథీరాంజీ మఠం కలసి సంయుక్తంగా ప్రభుత్వ అనుమతితో మానికొండ కుప్పుస్వామినాయుడు కుటుంబానికి అధికారికంగా విక్రయించాయి. అయితే కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఈ మొత్తం 6.56 ఎకరాల భూమిని ఆక్రమించారు. రెండు మఠాల నుంచీ వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా, హక్కులు కల్పించకపోయినా స్థలాలు అనధికారికంగా విక్రయిస్తున్నారు. ఆ స్థలాల్లో భారీ ఎత్తున భవనాలు నిర్మిస్తున్నారు. మార్కెట్ ధరల ప్రకారం ఈ భూముల విలువ రూ.100 కోట్లకు పైనే. ఈ భూములకు ఆనుకునే సర్వే నంబరు 147-1లో 48.60 ఎకరాల హథీరాంజీ మఠం భూములు ఉన్నాయి. ఇందులో 13.29 ఎకరాల భూమి పరకాల మఠానిది. ఈ భూమిని హథీరాంజీ మఠమే నిర్వహించేది. 1999లో భాగాలు పరిష్కారం చేసుకుని పరకాల మఠం భూమిని మానికొండ కుప్పుస్వామినాయుడు కుటుంబానికి ప్రభుత్వ అనుమతితో అధికారికంగా 13.29 ఎకరాలను విక్రయించింది. మరో 10.10 ఎకరాల భూమిని మఠం ప్రభుత్వ అనుమతితో అధికారికంగా మఠానికి చెందిన ఉద్యోగులకు, ఇతరులకు విక్రయించింది. మిగిలిన 25 ఎకరాలూ సాయినగర్, లింగేశ్వర్ నగర్ పంచాయతీల పరిధిలో కబ్జాలకు గురయ్యాయి. అందులో ఇళ్లు కట్టుకున్నారు. ఈ భూము ల విలువ రూ. 300 కోట్లు. ఇళ్లు నిర్మించుకున్న వా రు మార్కెట్ విలువ చెల్లిస్తామని, తమకు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. వారి తరఫున స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పరకాల మఠం నుంచి కుప్పుస్వామినాయుడు కుటుంబీకులు కొనుగోలు చేసిన 13.29 ఎకరాల్లో కూడా 3 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. అందులోనూ ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.
హథీరాంజీ మఠం ఆస్తులివీ
దేశంలోనే అత్యధికంగా ఆస్తులు కలిగిన మఠాల్లో తిరుపతికి చెందిన స్వామి శ్రీ హథీరాంజీ మఠం ఒకటి. రామానంద సంప్రదాయానికి చెందిన ఈ మఠానికి ఏపీలో 1634 ఎకరాలు, మహారాష్ట్రలో 296 ఎకరాలు, తమిళనాడులో 162 ఎకరాలు, చెన్నైలో విలువైన స్థలాలు, షాపింగ్ గదులు, బెంగళూరులో ఖరీదైన స్థలం ఉన్నాయి. తిరుపతి, తిరుచానూరు, తిరుమలలో 200 షాపింగ్ గదులున్నాయి. ఇవి కాకుండా తిరుపతిలో 6 ఆలయాలు, తిరుమలలో 5, దేశవ్యాప్తంగా 7.. మొత్తం 18 ఆలయాలు, పలు కల్యా ణ మండపాలు ఉన్నాయి. బ్యాంకుల్లో రూ.15 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ రూ.10 వేల కోట్లకు పైగా ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ
తిరుపతి ప్రాంతంలో హథీరాంజీ మఠానికి చెందిన భూములు దాదాపుగా మఠం స్వాధీనంలో లేవు. కిందటి తరంలో కౌలుకు తీసుకున్న రైతులు చాలావరకూ వాటిని సొంతం చేసుకున్నారు. కొందరు ఇతరులకు విక్రయించేశారు. మఠం అధిపతులుగా ఉన్న కొందరు మహంతులు సైతం ఇష్టానుసారంగా భూములు, స్థలాలను అమ్మేశారు. దేవదాయ చట్టాలు, నిబంధనల ప్రకారం ఈ అమ్మకాలేవీ చెల్లుబాటు కావు. అయినా పట్టించుకునే నాథుడు లేడు. భూముల స్వాధీనానికి ఎప్పుడు ప్రయత్నించినా మఠం అధికారులు, ఉద్యోగులపై ఆక్రమణదారులు దౌర్జన్యాలకు దిగుతున్న పరిస్థితి. క్రమేపీ మఠం యంత్రాంగం సైతం చేతులెత్తేసింది. వారిలో కూడా పలువురు చేతనైన కాడికి జేబులు నింపుకొని కబ్జాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకరిద్దరు అధికారులు నిజాయితీగా ప్రయత్నించినా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ సహకారం లభించలేదు. మఠానికి భారీగా ఆస్తులున్నా వార్షికాదాయం రూ.5 కోట్లు మాత్రమే. ఏళ్ల తరబడి షాపింగ్ గదుల అద్దె బకాయిలు పేరుకుపోయాయి. రూ.10 కోట్లకు పైగా వసూలు కావాల్సివుంది. ఇంత ప్రాధాన్యం, ప్రాముఖ్యత కలిగిన మఠానికి ప్రభుత్వం రెగ్యులర్ అధికారిని నియమించడం లేదు. దీంతో మఠం నిర్వహణ గాడితప్పి రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు, ఆదాయం చేజారిపోతున్నాయి.
