ఏపీలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు.. పునరావాసం కోసం రూ.75 లక్షలు పంపిణీ:డీజీపీ
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:47 AM
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నక్సల్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చామని డీజీపీ హరీష్ కుమర్ గుప్తా తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లతో ఎప్పటికప్పుడు తమ వాళ్లు మాట్లాడుతూ వారి జీవనోపాధి పై ఆరా తీస్తున్నారని చెప్పారు.
అమరావతి, నవంబర్ 28: సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నక్సల్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చామని డీజీపీ హరీష్ కుమర్ గుప్తా తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లతో ఎప్పటికప్పుడు తమ వాళ్లు మాట్లాడుతూ వారి జీవనోపాధి పై ఆరా తీస్తున్నారని చెప్పారు. హింసతో ఎవరూ ఏదీ సాధించలేరనే మార్పు వారిలో స్పష్టంగా వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. శనివారం రాజధాని అమరావతిలోని ఏపీ డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు పునరావాస సహాయం కింద రూ. 75 లక్షల డి.డిలను ఆయన స్వయంగా అందజేశారు.
అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు (జోరిగ నాగరాజు అలియాస్ కమలేష్), ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులతోపాటు పది మంది ఏరియా కమిటీ, ఐదుగురు దళ సభ్యులు ఉన్నారని వివరించారు. రాష్ట్ర కమిటీ, రీజనల్ కమిటీ సభ్యులతో సహా మొత్తం 18 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారని చెప్పారు.
గత రెండున్నర ఏళ్లలో ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారని పేర్కొన్నారు. 73 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. లొంగిపోయిన నక్సలైట్లకి రూ. 2.87 కోట్ల రివార్డు మొత్తంలో ఇప్పటికే రూ. 91 లక్షలు అందించామని తెలిపారు. ఈరోజు 18 మందికి రూ. 75 లక్షలు పంపిణీ చేశామని అన్నారు. లొంగిపోయిన మరో 32 మంది మావోయిస్టులకు రూ.1.21 కోట్ల పునరావాస సహాయం త్వరలోనే అందిస్తామని ప్రకటించారు. సరల్ ద్వారా 2,000 మందికి వృత్తి శిక్షణ, ప్రేరణ కింద 1,200 మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు గణాంకాలతో సహా తెలిపారు.
స్ఫూర్తి ద్వారా 175 మంది ఉద్యోగాలు సాధించగా, మన్యం జిల్లాల్లో 169 రహదారులు, 39 వంతెనల నిర్మాణం చేపట్టారని వివరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 2,090 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా 96 శాతం గ్రామాలకు నెట్వర్క్ అనుసంధానం పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ రోజు 18 మందిలో 17 మందికి రూ. లక్ష, 4, 5 లక్షలు ఇచ్చామని వివరించారు. స్టేట్ కమిటీ మెంబర్ నాగరాజుకు రూ.20 లక్షలు అందచేశామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన పసిడి ధర.. నేటి రేట్లివే!
స్త్రీల సాధికారత కోసం జీవితాంతం కృషి చేసిన పూలే: సీఎం చంద్రబాబు