Share News

కూటమి శ్రేణుల మధ్య చిచ్చుకు కుట్ర?

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:44 AM

సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ, ఆ పార్టీ ముఖ్య నేత లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు, కల్పిత వీడియోలు, పోస్టులు ప్రచారం చేస్తూ.. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు.

కూటమి శ్రేణుల మధ్య చిచ్చుకు కుట్ర?

  • సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్టులు

  • తెరవెనుక వైసీపీ కుట్రపై అనుమానాలు

  • హైదరాబాద్‌లో నిందితుడు అదుపులోకి

గుంటూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ, ఆ పార్టీ ముఖ్య నేత లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు, కల్పిత వీడియోలు, పోస్టులు ప్రచారం చేస్తూ.. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పేరుతో తెరిచిన ఎక్స్‌ ఖాతా ద్వారా లోకేశ్‌, టీడీపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వెనుక వైసీపీ హస్తం ఉంటుందని టీడీపీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు గింజుపల్లి నవీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 1న నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలోని కంటెంట్‌ టీడీపీ, జనేసన కార్యకర్తల మధ్య అపోహలు, విభేదాలు పెంచే విధంగా ఉందని, తద్వారా రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ కేసు విచారణలో భాగంగా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన నిందితుడు తీర్థాల నాగ వెంకటదుర్గారాకేశ్‌ను నల్లపాడు పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని, గుంటూరుకు తరలించినట్లు తెలిసింది. సెప్టెంబరు 26న అప్‌లోడ్‌ చేసిన 2.13 నిమిషాల నిడివి గల ఓ వీడియోతో పాటు మరికొన్ని పోస్టులు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందినట్లు పోలీసులు గుర్తించారు. సంబంధిత పోస్టుకు 17 వేలకుపైగా వ్యూస్‌ వచ్చినట్లు దర్యాప్తులో కనుగొన్నారు. రాకేశ్‌ గతంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అంతకుముందు లోకేశ్‌కు సంబంధించిన సోషల్‌ మీడియా టీమ్‌లోనూ పనిచేసినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి.

అయితే రెండు చోట్లా అతడి వ్యవహారశైలి, కార్యకలాపాలు నచ్చక బయటకు పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. జనేసన కార్యాలయం నుంచి బయటకు పంపిన అనంతరం రాకేశ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారి టీడీపీ, జనేసనకు చెందిన స్థానిక క్యాడర్‌ మధ్య అపార్థాలు, అనుమానాలు, విభేదాలు పెంచేలా కంటెంట్‌ రూపొందించి ప్రచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపించేలా కల్పిత లేదా తప్పుదారి పట్టించే కంటెంట్‌ను ప్రచారం చేశాడా? దాని వెనుక ఉద్దేశం ఏమిటి? వీడియో మీడియా పోస్టులను వ్యక్తిగతంగా రూపొందించి ప్రచారం చేశాడా? లేక మరెవరైనా వ్యక్తులు, సంస్థలు లేదా రాజకీయ ప్రయోజనాలున్న వర్గాల సూచనలు, సహకారం ఉన్నదా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 04:44 AM