Share News

సామూహిక రాజీనామాలు లేవు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:00 AM

పెట్టుబడులపై గూఢచర్యం... 15 మంది ఉద్యోగులకు ఉద్వాసన’... అంశంపై ‘గైడెన్స్‌ తమిళనాడు’ సంస్థ స్పందించింది. ఈ ఏడాది జూలై నుంచి తమ సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు జరగలేదని స్పష్టం చేసింది

సామూహిక రాజీనామాలు లేవు!

  • ఉద్యోగులు ఇతర సంస్థల్లో చేరడం సహజమే!

  • ‘గైడెన్స్‌ తమిళనాడు’ అదికారిక ప్రకటన

  • ఏపీలో చేరిన వారిపై నెపం నెట్టొద్దు: పళనిస్వామి

  • విజయ్‌ సర్కారులో పనిచేయలేని స్థితి: అన్బుమణి

చెన్నై, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘పెట్టుబడులపై గూఢచర్యం... 15 మంది ఉద్యోగులకు ఉద్వాసన’... అంశంపై ‘గైడెన్స్‌ తమిళనాడు’ సంస్థ స్పందించింది. ఈ ఏడాది జూలై నుంచి తమ సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉండే ‘గైడెన్స్‌ తమిళనాడు’ నోడల్‌ ఏజెన్సీ తాజాగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియాకు చెందిన రెండు సంస్థలు తమ యూనిట్ల స్థాపనకు తమిళనాడును కాదని ఏపీని ఎంచుకోవడం... ఈ విషయాన్ని డీఎంకే అధినేత స్టాలిన్‌ పదిరోజుల ముందుగానే ప్రకటించడం... ‘గైడెన్స్‌ తమిళనాడు’ ఉద్యోగుల నుంచే స్టాలిన్‌కు, ఏపీకి సమాచారం లీక్‌ అయిందని వార్తలు రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ‘గైడెన్స్‌ ఏజెన్సీ’ శుక్రవారం అధికారికంగా స్పందించింది.

‘‘మెరుగైన కెరీర్‌ అవకాశాలు, ఉన్నత విద్య, వేరే ప్రాంతానికి మారడం, వ్యక్తిగత బాధ్యతలు, వృత్తిపరమైన కారణాలవల్ల ఉద్యోగులు సంస్థను విడిచిపోవడం సహజమే. ఉద్యోగుల వృత్తిపరమైన ఆకాంక్షలను గైడెన్స్‌ తమిళనాడు ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. తమిళనాడు తన ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ ని కొనసాగిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది’’ అని గైడెన్స్‌ తమిళనాడు పేర్కొంది.


మీ చేతగానితనం వల్లే: పళనిస్వామి

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన చేతగానితనం, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ‘గైడెన్స్‌ తమిళనాడు’ నిర్వీర్యంగా తయారైందని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గైడెన్స్‌ తమిళనాడును జయలలిత స్థాపించారని, అప్పటి నుంచి అందులో అనేకమంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. వెళ్లిపోయిన సిబ్బంది అనుభవజ్ఞులైన నిపుణులు కాబట్టే ఇతర రాష్ట్రాల్లో కూడా పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అసమర్థతను పక్కనబెట్టి, ఏపీ ప్రభుత్వంలో చేరిన ముగ్గురు ఉద్యోగులపై నెపం నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

మరోవైపు... 15 మంది ఉద్యోగుల తొలగింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పీఎంకే అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ అన్బుమణి డిమాండ్‌ చేశారు. ‘‘గతంలో గైడెన్స్‌ తమిళనాడులో పని చేసిన వారిలో ముగ్గురు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్నట్లు స్పష్టమైపోయింది. టీవీకే ప్రభుత్వం వచ్చాక తాము గైడెన్స్‌ తమిళనాడులో పని చేయలేని స్థితిలో ఉన్నామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశామని ఆ ముగ్గురు ఉద్యోగులు తెలిపారు. టీవీకే ప్రభుత్వం వచ్చిన నెలలోపే తాము సంస్థ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. వీటిలో ఏది నిజమో ప్రభుత్వం తేల్చాలి’’ అని అన్బుమణి డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 06:44 AM