Share News

బీపీసీఎల్‌కు లైన్‌ క్లియర్‌

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:37 AM

దేశీయ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయి చేరుకునే దిశగా మార్గం సుగమమైంది.

బీపీసీఎల్‌కు  లైన్‌ క్లియర్‌
BPCL LOGO

  • గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ముందడుగు

  • పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ సిఫారసు

  • రామాయపట్నంలో రూ.1.03 లక్షల కోట్లతో ప్లాంట్‌

  • గ్రీన్‌ హైడ్రోజన్‌, పునరుత్పాదక ఇంధన జోన్లకు పెద్దపీట

  • ఏటా 5.4 మి. టన్నుల పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ ఉత్పత్తి

  • మరో 3.2 మి. టన్నుల పెట్రోకెమికల్స్‌ ఉత్పత్తుల తయారీ

న్యూఢిల్లీ, నెల్లూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశీయ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయి చేరుకునే దిశగా మార్గం సుగమమైంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) రూ.1.03 లక్ష కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌కు కీలక ముందడుగు పడింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ(ఈఏసీ).. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతో పాటు కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌(సీఆర్‌జెడ్‌) అనుమతులను మంజూరు చేయాలని సిఫారసు చేసింది. ఆదివారం జాతీయ మీడియా సంస్థ బిజినెస్‌ స్టాండర్డ్‌ తన కథనంలో ఈ మేరకు పేర్కొంది. గతేడాది డిసెంబరులో ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఈ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఎలాం టి న్యాయ వివాదాలు పెండింగ్‌లో లేవని ప్రాజెక్టు కన్సల్టెంట్‌ సంస్థ ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ స్పష్టం చేసింది. సాధారణంగా ఈఏసీ సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం లాంఛనమే. దీంతో దేశంలోనే మూడో అతిపెద్ద రిఫైనరీ సంస్థ బీపీసీఎల్‌కు రామాయపట్నం వద్ద నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. అనుమతులు వచ్చిన వెంటనే ప్లాంట్‌ నిర్మాణ పనులు మొదలుపెట్టనుంది.


ప్రాంతీయ ఇంధన హబ్‌గా ఏపీ

రామాయపట్నం పోర్టు సమీపంలో నెల్లూరు జిల్లా పరిధిలో 5200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు బీపీసీఎల్‌ ప్రతిపాదించింది. ప్రతిపాదిత భూముల్లో 1563 ఎకరాలను గ్రీన్‌ ఫీల్డ్‌ బెల్ట్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే పర్యావరణ నిర్వహణ ప్రణాళిక కోసం పెట్టుబడిలో రూ.3022 కోట్లు కేటాయించారు. ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక ప్రత్యక్షంగా 1250 మందికి, పరోక్షంగా 3750 మందికి ఉపాధి అవకాశం కలుగుతుందని బీపీసీఎల్‌ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. సంవత్సరానికి తొమ్మిది మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ రిఫైనరీ, పెట్రో కమికల్‌ కాంప్లెక్స్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌, నాఫ్తా, ఎల్‌పీజీ, బిటుమినస్‌ వంటి వాటిని ఉత్పత్తి చేయనున్నారు. 5.4 మిలియన్‌ టన్నుల రవాణా ఇంధనాలు (పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌), మరో 3.2 మిలియన్‌ టన్నుల పెట్రోకెమికల్స్‌ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఒక ప్రాంతీయ ఇంధన హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా.. ఈ ప్రాజెక్టులో ప్రత్యేకంగా గ్రీన్‌ హైడ్రోజన్‌, పునరుత్పాదక ఇంధన జోన్లు, రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా పెద్ద మెరైన్‌ క్రూడ్‌ ఆయిల్‌ టెర్మినల్‌ విశేషం. ఈ ప్రాజెక్ట్‌ నీటి అవసరాలు తీర్చేందుకు రోజువారీగా 2,25,648 క్యూబిక్‌ మీటర్ల మంచినీటిని డీశాలినేషన్‌ ప్లాంటు ద్వారా సమకూర్చుకోనుండగా, సముద్రం నుంచి రోజుకు 6,24,000 క్యూబిక్‌ మీటర్ల నీటిని పైప్‌లైన్ల ద్వారా సేకరిస్తారు. ఇక ప్రాజెక్ట్‌ నిర్వహణకు 770 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుంది. అందులో 185 మెగావాట్ల విద్యుత్‌ను సొంతంగా ఏర్పాటు చేసే ప్లాంట్‌ నుంచి సమకూర్చుకోనుండగా, మిగిలిన 585 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌ నుంచి తీసుకోనున్నారు. బీపీసీఎల్‌.. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 05 , 2026 | 04:38 AM