Share News

వర్షంలో.. రైలు మింగేసింది!

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:10 AM

వెనుక నుంచి రైలు ఢీకొనడంతో నలుగురు బాలురు అక్కడిక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం మేరకు..

వర్షంలో.. రైలు మింగేసింది!

  • టెక్కలిలో రైలు ఢీకొని నలుగురు బాలురు దుర్మరణం

  • అందరూ ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు

టెక్కలి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వెనుక నుంచి రైలు ఢీకొనడంతో నలుగురు బాలురు అక్కడిక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం మేరకు.. టెక్కలి, మెళియాపుట్టి మండలాలకు చెందిన నలుగురు ఇంటర్‌ విద్యార్థులు టెక్కలి జూనియర్‌ కళాశాలలో చదువుతున్నారు. బుధవారం సెలవు కావడంతో వీరంతా కాలవలో చేపలవేటకు వెళ్లి చేపలు పట్టుకుని తిరుగుముఖం పట్టారు. నౌపడా నుంచి గుణుపూర్‌ వెళ్లే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 12.45గంటలకు టెక్కలి సమీపంలో గల రావివలస జంక్షన్‌ బర్మా కాలనీ ప్రాంతానికి చేరుకుంది. ఆ సమయంలో వర్షం జోరుగా కురుస్తోంది. నలుగురు బాలురు ట్రాక్‌పై నడుస్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు వీరిని ఢీకొట్టింది. ఈ సమయంలో వీరు ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో టెక్కలి మండలం మొఖలింగాపురం పంచాయతీ డమర గ్రామానికి చెందిన జన్ని దిలీప్‌(16), గంగువాడ విశాఖరావు(16), మేఘవరం పంచాయతీ చిన్నభీంపురం గ్రామానికి చెందిన జన్ని శరత్‌(16), మెళియాపుట్టికి చెందిన సవర శివ(16) అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు వస్తున్న డమర గ్రామానికి చెందిన జన్ని సాల్మన్‌రాజు ట్రాక్‌ పక్కన నడుస్తుండగా.. రైలు ఇంజన్‌ చివర తగిలి పక్కకు పడిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి చేయి, కాలు విరిగాయి. హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. గంటన్నరకు పైగా రైలును అక్కడే నిలిపివేశారు. మృతి చెందిన వారంతా గిరిజన కుటుంబాలకు చెందిన వారు. ఈ ఘటనలో మృతదేహాలు ఛిద్రమై రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావుతో పాటు రైల్వే అధికారులు చేరుకున్నారు. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకుని బోరుమని విలపించారు. ఘటనపై పలాస జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


మంత్రుల విచారం

కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలను రైల్వే, రెవెన్యూ, పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలిపారు.

Updated Date - Sep 24 , 2026 | 05:10 AM