Share News

రుణ కాగితాలపై సంతకం నేనే పెట్టా..

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:26 AM

రుణం తీసుకునేందుకు కాగితాలపై తానే సంతకం చేశానని, కానీ అందులో ఏం రాసుందో చూడలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పోలీసుల విచారణలో చెప్పారు.

 రుణ కాగితాలపై సంతకం నేనే పెట్టా..

  • అందులో ఏం రాసుందో చూడలేదు!

  • కంపెనీ వ్యవహారాలు పూర్తిగా తెలియవు

  • నా భార్య, భాగస్వాములు చూసుకుంటారు

  • స్థలం తనఖా విషయం ముందే చెప్పా

  • చీటింగ్‌ కేసులో విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌

  • 70కి పైగా ప్రశ్నలు సంధించిన పోలీసులు

  • రేపు మళ్లీ హాజరుకు పోలీసుల నోటీసులు

తెనాలి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రుణం తీసుకునేందుకు కాగితాలపై తానే సంతకం చేశానని, కానీ అందులో ఏం రాసుందో చూడలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పోలీసుల విచారణలో చెప్పారు. విజయవాడకు చెందిన ఐ.కె.ఎఫ్‌ సంస్థ దగ్గర 2019లో తన స్థలాన్ని తనఖా పెట్టి రూ.3 కోట్లు అప్పు తీసుకుని చెల్లించకపోగా, ఆ స్థలంలో కొంత ముందే అమ్మేసిన విషయం చూపించకుండా అధికారం అండతో మోసం చేశారంటూ ఆ సంస్థ ఇటీవల తెనాలి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తనకు, తన భార్య పుష్పకు, కంపెనీ భాగస్వామి శ్రీనివాస శివరామ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషను కొట్టివేసిన కోర్టు ముందు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 14 రోజుల వరకు అరెస్ట్‌ చేయవద్దని పేర్కొంది. సివిల్‌ కేసు వ్యవహారాన్ని కావాలనే క్రిమినల్‌ కేసుగా నమోదు చేశారని, దీనిని కొట్టివేయాలని కోరుతూ శివకుమార్‌ తరపు న్యాయవాదులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు.


దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు శివకుమార్‌, శ్రీనివాస శివరామ్‌ తమ న్యాయవాదుల బృందంతో కలసి బుధవారం తెనాలి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగింది. విచారణలో భాగంగా సీఐ దాదాపు 70కిపైగా ప్రశ్నలు వేశారు. ఏపీజె ఇంటెక్స్‌ కంపెనీ మీదేనా? ఆ కంపెనీ పేరుతో ఏ వ్యాపారం చేస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులు నిజంగా జరిగాయా? అసలు ఆ కంపెనీ ఎక్కడ ఉంది? ఆ కంపెనీ పేరుపై అప్పు తీసుకునేందుకు తనఖా పెట్టిన స్థలంలో కొంత ముందే అమ్మేశారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోసం చేశారని రుణ సంస్థ అంటోంది... దీనికి మీ సమాధానమేంటి? అంటూ ప్రశ్నలు సంధించారు. కంపెనీ వ్యవహారాలు తనకు పూర్తిగా తెలియదని, తన భార్య, భాగస్వాములు చూసుకుంటారని శివకుమార్‌ బదులిచ్చినట్లు సమాచారం. తనఖా కింద చూపిన 1,200 గజాల స్థలంలో 500 గజాలు అమ్మినట్లు కంపెనీ వారికి ముందే చెప్పానని, మరో 100 గజాల్లో తన తండ్రి సమాధి ఉందని, మిగిలిన స్థలాన్ని తనఖా పెడుతున్నట్టు చెప్పానని బదులిచ్చినట్టు తెలిసింది.


అప్పట్లో స్థలానికి సంబందించిన ఈసీ, లీగల్‌ ఒపీనియన్‌ వంటి కాగితాలన్నీ కంపెనీ వారే తీసుకొచ్చారని, అన్నీ సరి చూసుకోకుండా ఎలా తీసుకొస్తారని అన్నాబత్తుని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. తాను ఎమ్మెల్యే కాకముందు 2016లో కూడా తన కళాశాలకు సంబంధించిన గౌతమ బుద్ధ సొసైటీకి అదే సంస్థ రుణం ఇచ్చిందని, అప్పుడు చేయని తప్పు ఎమ్మెల్యే అయ్యాక ఎలా చేస్తానని అడిగినట్లు తెలిసింది. తన పాత్రపై వారు ఆరోపణలు చేస్తే, వారి పాత్రపైనా తాను ఆరోపణలు చేస్తున్నానని, వారిని కూడా విచారిస్తే కచ్చిత సమాచారం వస్తుందని చెప్పినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తులేదని, ఈసారి జరిగే విచారణలో సమాధానాలు ఇస్తానని చెప్పినట్టు ఆయన సమాచారం.

కాగా, సంస్థ ఎండీగా ఉన్న శివకుమార్‌ భార్య అన్నాబత్తుని పుష్ప మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఆమె అనారోగ్య కారణాలతో రాలేకపోయారని, దీనికి సంబంధించిన డాక్టర్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని అందించారని సీఐ తెలిపారు. ఇద్దరు వీఆర్‌ఓల సమక్షంలో 3గంటలకు పైగా సాగిన విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కావాలని శివకుమార్‌కు పోలీసులు నోటీసు ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:26 AM