Share News

జనసేనలోకి వంగవీటి రాధా!

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:26 AM

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాదాకృష్ణ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

జనసేనలోకి వంగవీటి రాధా!

  • నేడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో చేరిక

విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాదాకృష్ణ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జనసేనలో చేరికకు బుధవారం దాదాపుగా ముహూర్తం ఖరారైంది. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో రాధా చేరికకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. రాధాతో పాటు ఆయన ముఖ్య అనుచరులు పలువురు జనసేన కండువా కప్పుకోనున్నారు. రాధా పార్టీలోచేరిన తర్వాత జిల్లా పార్టీ నేతలతో పవన్‌ ఆంతరంగిక సమావేశం నిర్వహించనున్నారు. పక్షం రోజులుగా మేయర్‌ రేసులో రాధా సతీమణి పుష్పవల్లి పేరు వినిపిస్తోంది. తన భార్య పోటీ చేయటం లేదని రాధా కూడా స్పష్టతనిస్తున్నారు.

తాజాగా రాధాకృష్ణ మేయర్‌ అభ్యర్థిగా తెరమీదకు వచ్చారు. విజయవాడ మేయర్‌ సీటు జనసేనకు కేటాయిస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కిందటి సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి వంగవీటి రాధా కృషి చేశారు. టీడీపీ సభ్యత్వం తీసుకోనప్పటికీ కొంతకాలంగా ఆ పార్టీతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఇటీవల పవన్‌తో భేటీ నేపథ్యంలో రాధా తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన రాధాను విజయవాడ మేయర్‌ ఎన్నికలలో పోటీకి దింపాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. అయితే తాను జనసేన నుంచి బరిలోకి దిగుతానని వెల్లడించినట్లు సమాచారం.

రాధా తమ పార్టీలో చేరికపై జనసేనలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. విజయవాడలో మొత్తం 86 డివిజన్లు ఉండగా.. 35 స్థానాలు తమకు కేటాయించాల్సిందిగా జనసేన కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో టీడీపీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. పదిహేను స్థానాలను ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:26 AM