Share News

మాజీ మంత్రి శత్రుచర్ల కన్నుమూత

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:12 AM

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత శత్రుచర్ల విజయరామరాజు గురువారం విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మాజీ మంత్రి శత్రుచర్ల కన్నుమూత

  • నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

  • సంతాపం తెలిపిన సీఎం,మంత్రి లోకేశ్‌, పల్లా

అమరావతి, పార్వతీపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత శత్రుచర్ల విజయరామరాజు గురువారం విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1948 ఆగస్టు 4న ఉమ్మడి విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి జమిందార్‌ వంశంలో జన్మించిన శత్రుచర్ల రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి నాగూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1983, 1985లో ఎమ్మెల్యేగా, 1989, 1991, 1999లో పార్వతీపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

2004, 2009లో పార్వతీపురం ఎమ్మెల్యేగా గెలిచి అటవీ, పర్యావరణ, సాంకేతిక, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై పెద్దల సభలో అడుగు పెట్టారు. శత్రుచర్ల మృతిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయం

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతిపై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయమని, విజయరామరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయరామరాజు మృతికి మంత్రి లోకేశ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంతాపం తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 04:18 AM