‘కారుమూరే’ కీలకం!
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:58 AM
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన అభియోగపత్రంలో పేర్కొంది.
మద్యం రవాణా వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రి కుమారుడిపై చార్జిషీట్
సబ్ కాంట్రాక్టుల సూత్రధారి సునీల్
బిల్లుల పెంపుతో 24.45 కోట్ల దోపిడీ
రూ.16 కోట్లు నగదు రూపంలో మళ్లింపు
భార్య కీర్తి ఖాతాల్లోకి రూ.2.30 కోట్లు
ఏసీబీ కోర్టులో వేసిన చార్జిషీట్లో సిట్ వెల్లడి
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన అభియోగపత్రంలో పేర్కొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులను ఖరారు చేయడం నుంచి, వచ్చిన లాభాల్లో వాటాలు వసూలు చేయడం వరకు సునీలే అన్నీ తానై వ్యవహరించినట్లు తెలిపింది. బిల్లులను భారీగా పెంచి, దొంగ ఇన్వాయిస్ల ద్వారా రూ.24.45 కోట్ల మేర అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది. ఈ కేసులో కీలక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలతో శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అభియోగపత్రం దాఖలు చేసింది. మద్యం రవాణా కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్దీ లిమిటెడ్ ద్వారా జరిగిన వ్యవహారాల్లో రాజ్ కేసిరెడ్డి, డి.వాసుదేవరెడ్డి, టి.ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డిల పాత్రను కూడా సిట్ ప్రస్తావించింది.
కాంట్రాక్టుల కోసం హైదరాబాద్‌కు పిలుపు
కారుమూరి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆయా జిల్లాల్లో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులను తన అనుచర వర్గానికి అనుకూలంగా మళ్లించారని సిట్ ఆరోపించింది. సబ్ కాంట్రాక్టులు ఆశించిన వారిని 2021 నవంబరు 1న హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని కేఎఫ్ వద్దకు సునీల్ పిలిపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రవాణా కాంట్రాక్టుల ద్వారా వచ్చే లాభాల్లో వాటా ఇచ్చేందుకు అంగీకరించిన వారికి, డిపోల వారీగా సబ్ కాంట్రాక్టులు కేటాయించినట్లు సిట్ తెలిపింది. కొందరి నుంచి 45 శాతం, మరికొందరి నుంచి 85 శాతం వరకు లాభాల్లో వాటా తీసుకున్నట్లు అభియోగపత్రంలో పేర్కొంది. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో సబ్ కాంట్రాక్టు పొందిన ఒక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. సునీల్ తనకు కాంట్రాక్టు ఇప్పించారని, అందుకు ప్రతిఫలంగా లాభాల్లో 45 శాతం వాటాను కమీషన్‌గా చెల్లించానని ఆయన సిట్‌కు తెలిపినట్లు అభియోగపత్రంలో వివరించారు.
మద్యం రవాణా బిల్లుల్లో ఒక్కో బిల్లుపై రూ.40-60 లక్షల వరకు అదనంగా చూపించి, ఇన్ఫ్లేటెడ్ ఇన్వాయిస్ల ద్వారా రూ.24.45 కోట్ల మేర సొమ్ము కొల్లగొట్టినట్లు గుర్తించింది. ఈ మొత్తాన్ని వివిధ మార్గాల్లో కారుమూరి కుటుంబానికి చేరవేసినట్లు ఆధారాలను కోర్టుకు సమర్పించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు కట్టబెట్టి, దాని ద్వారా వచ్చిన లాభాల్లో 85 శాతం వరకు కారుమూరి కుటుంబం పొందినట్లు ఆరోపించింది. సిట్ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిన తర్వాత సునీల్ పాత తేదీతో ఒప్పంద పత్రాన్ని సృష్టించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.
ఖాతాలకు లిక్కర్ సొమ్ము
సబ్ కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన డబ్బు కారుమూరి కుటుంబ సభ్యులకు చేరినట్లు సిట్ గుర్తించింది. సునీల్, నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తనకు సంబంధించిన సొమ్ములో రూ.1.09 కోట్లను సునీల్ భార్య వల్లూరు కీర్తికి చెందిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు ఒక సబ్ కాంట్రాక్టర్ వాంగ్మూలం ఇచ్చారు. కల్లెపల్లి నారాయణరావు అనే మరో సబ్ కాంట్రాక్టర్ కూడా అదే ఖాతాల్లోకి రూ.1.21 కోట్లు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు, పెంచిన బిల్లుల ద్వారా వచ్చిన మొత్తంలో రూ.16 కోట్లను సబ్ కాంట్రాక్టర్లు మధ్యవర్తుల ద్వారా కారుమూరి కుటుంబ సభ్యులకు అందించినట్లు సిట్ పేర్కొంది.
అక్రమ సొమ్ముతో ఆస్తులు, విలాసాలు
మద్యం రవాణా స్కాం ద్వారా వచ్చిన సొమ్మును కారుమూరి కుటుంబం వ్యక్తిగత అప్పుల చెల్లింపులు, స్థిరాస్తుల కొనుగోళ్లు, ఆస్తుల కొనుగోలుకు అడ్వాన్సులు, మైనింగ్ లీజుల హక్కుల కోసం వినియోగించినట్లు సిట్ తెలిపింది. విలాసవంతమైన వాహనాలు, ఖరీదైన వాచీల కొనుగోళ్లు, పుట్టినరోజు వేడుకలు, విమాన ప్రయాణాలు, రాజకీయ నిధుల సమీకరణ, ఈఎంఐలు, వ్యక్తిగత ఖర్చులు, క్యాంపు కార్యాలయ ఖర్చులకు కూడా ఉపయోగించినట్లు దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు