ఇక రోజువారీ విచారణ!
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:18 AM
: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అన్ని కేసులనూ రోజువారీ ప్రాతిపదికన విచారించాలని..
ఇక రోజువారీ విచారణ!
జగన్పై ఈడీ, సీబీఐ కేసుల్లో ప్రత్యేక కోర్టు నిర్ణయం
అక్రమాస్తుల వ్యవహారంలో కీలక పరిణామం
మొత్తం 9 ఈడీ, 11 సీబీఐ చార్జిషీట్లు
న్యాయస్థానంలో పదేళ్లుగా పెండింగ్
141 డిశ్చార్జ్ పిటిషన్లు కూడా
రోజువారీ విచారణతో ఇక కదలిక
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అన్ని కేసులనూ రోజువారీ ప్రాతిపదికన విచారించాలని నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలని ఈడీ తరఫు న్యాయవాదులకు సూచించింది.
తాము దాఖలు చేసిన 9 చార్జిషీట్లలో విచారణ పెండింగ్లో ఉందని, డిశ్చార్జ్ పిటిషన్లు, న్యాయమూర్తుల బదిలీలు తదితర కారణాలతో ముందుకు సాగడం లేదని తెలంగాణ హైకోర్టులో ఈడీ అధికారులు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రోజువారీ విచారణకు ప్రత్యేక కోర్టు ఉపక్రమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు, ఈడీ దాఖలు చేసిన 9 చార్జిషీట్లతో కలిపి మొత్తం 20 చార్జిషీట్లపై విచారణ ఇక రోజువారీ జరగనుంది. వచ్చే సోమవారం (19వ తేదీ) నుంచే ఇది జరిగే అవకాశాలున్నాయని న్యాయవాద వర్గాలంటున్నాయి. జగన్ తదితరులు, పలు కంపెనీలకు క్విడ్ ప్రో కో పద్ధతిలో జరిగిన ఆర్థిక ప్రయోజనాలు, మనీలాండరింగ్ వ్యవహారం, డొల్ల కంపెనీలు, నిధుల ప్రవాహానికి సంబంధించి ఈడీ అధికారులు పదేళ్ల కిందటే 9 చార్జిషీట్లు సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు.
ఈడీ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు కూడా ఇదే. జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో ఈడీ కేసుల విచారణ ముందుకు సాగలేదు. జగన్ కేసుల్లో రోజువారీ విచారణకు ఆదేశించాలంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యతో పాటు పలువురు తెలంగాణ హైకోర్టులో గతంలోనే వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇటీవల ఈడీ దాఖలు చేసిన పిటిషన్తో వాటిని కూడా జతచేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు రోజువారీ విచారణకు నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఈడీ కేసులివీ..
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11 చార్జిషీట్లు వేసింది. హెటిరో-అరబిందో ఫార్మా, వ్యక్తిగత పెట్టుబడిదారులు, రాంకీ, వాన్పిక్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, ఇందు టెక్జోన్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఏపీ హౌసింగ్ ప్రాజెక్టులపై దర్యాప్తు ఆధారంగా వీటిని దాఖలుచేసింది. వీటిలో మనీలాండరింగ్ కోణంలో పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఈడీ అధికారులు జగన్, విజయసాయిరెడ్డిలతో పాటు పలువురు అధికారులు, కంపెనీలు, వ్యక్తులపై విచారణ జరిపి 9 చార్జిషీట్లు వేశారు. తాము వేసిన కేసులకు సంబంధించి 55, సీబీఐ కేసులకు సంబంధించి 86.. మొత్తం 141 డిశ్చార్జ్ పిటిషన్లను నిందితులు దాఖలుచేశారని.. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయని ఈడీ హైకోర్టుకు తెలియజేసింది.
జగన్ హాజరవుతారా..?
ఈడీ, సీబీఐ కేసుల రోజువారీ విచారణ నేపథ్యంలో జగన్తో పాటు నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. సీబీఐ కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా కోర్టు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు. ఈ మినహాయింపు ఎత్తివేయాలని సీబీఐ వేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..