ఐదుగురు మహిళలు జల సమాధి
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:11 AM
వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు. దసరా సెలవులు కావడంతో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని గొల్లపల్లి రిజర్వాయర్ను చూసేందుకు వెళ్లారు.
గొల్లపల్లి రిజర్వాయర్లో మునిగి మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలో పెను విషాదం.. సీఎం, లోకేశ్ దిగ్ర్భాంతి
హిందూపురం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు. దసరా సెలవులు కావడంతో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని గొల్లపల్లి రిజర్వాయర్ను చూసేందుకు వెళ్లారు. అక్కడ నీటిలో దిగి కాసేపు సరదాగా గడిపారు. కానీ.. అంతలోనే అంతులేని విషాదం చోటుచేసుకుంది. నీటి లోతును అంచనా వేయడంలో విఫలమైన ఐదుగురు మరింత లోపలికి వెళ్లి జల సమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో పెనుకొండ పట్టణంలోని దర్గాపేటకు చెందిన పుష్పలత (29), హసీనా (40), ఆమె కుమార్తె మాహిన్ (17), గాయత్రమ్మ (50), ఆమె కుమార్తె అశ్విని(23) దుర్మరణం పాలయ్యారు.
హంద్రీనీవా నీటి చేరికతో గొల్లపల్లి రిజర్వాయర్ కళకళలాడుతోంది. దీంతో దర్గాపేటకు చెందిన శంకర, పుష్పలత దంపతులు, వారి కుమారుడు, కుమార్తె, హసీనా, ఆమె కుమార్తె మాహిన్, గాయత్రమ్మ ఆమె కుమార్తె అశ్విని శుక్రవారం ఉదయం రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. రిజర్వాయర్ వెనుక జలాల వద్ద... హంద్రీనీవా కాలువ ద్వారా నీరు ప్రవేశించే ప్రాంతంలో కాసేపు గడిపారు. ఒక్కొక్కరుగా నీటిలోకి దిగి.. సరదాగా గడిపారు. ఎండ తీవ్రత ఉండటంతో శంకర తన ఇద్దరు పిల్లలను తీసుకుని దగ్గరలోని చెట్టు నీడకు వెళ్లారు. మిగిలిన ఐదుగురు మాత్రం లోతును, నీటి ఉధృతిని అంచనా వేయలేక మరింత లోపలికి వెళ్లి మునిగిపోయారు. గమనించిన శంకర అక్కడికి చేరుకునేసరికే ఐదుగురు గల్లంతయ్యారు.
సమీపంలో ఉన్న గొర్రెల కాపరి పరుగున వచ్చి నీటిలో గాలించి ఒక్కొక్కరినీ ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అందరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సీఐ శేఖర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. గొల్లపల్లి రిజర్వాయర్లో ఐదుగురు మహిళలు మృతిచెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం తెలియగానే మంత్రి సవిత పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు