Share News

ఇవే మా ఆఖరి మాటలు కావచ్చు!

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:09 AM

ఉపాధి కోసం వచ్చి రష్యాలో వార్‌ఫ్రంట్‌లో చిక్కుకుపోయామని, తమను కాపాడాలని వేడుకుంటూ ఇద్దరు ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు పోస్టు చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవే మా ఆఖరి మాటలు కావచ్చు!

  • మమ్మల్ని కాపాడండి.. ఇండియా తీసుకువెళ్లండి

  • ఉపాధి కోసం వెళితే సిపాయిలుగా మార్చారు

  • రష్యా ఆర్మీ చేతిలో బందీలుగా ఐదుగురు

  • ఉమ్మడి విశాఖ జిల్లా యువకులు

  • ఉక్రెయిన్‌ యుద్ధంలో ముందుపెట్టారని ఆవేదన

  • ఆందోళనలో కుటుంబం.. మంత్రి లోకేశ్‌ భరోసా

చోడవరం (అనకాపల్లి జిల్లా), నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం వచ్చి రష్యాలో వార్‌ఫ్రంట్‌లో చిక్కుకుపోయామని, తమను కాపాడాలని వేడుకుంటూ ఇద్దరు ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు పోస్టు చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో కథనం మేరకు.. ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు అక్కడి ఆర్మీ చేతిలో బందీలై బలవంతంగా సిపాయిలుగా మార్చబడ్డారు. వార్‌ ఫ్రంట్‌లో తమను ముందువరుసలో ఉంచి బలిపశువులుగా నిలబెట్టారని..బహుశా ఇదే ఆఖరి మాటలు కావచ్చని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను కాపాడాలని ఆ వీడియోలో కన్నీటితో వేడుకున్నారు.

ఇందులో అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రాజుబాబు, బయలపూడి నాగరాజులు, కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన యువకుడు, విశాఖ నగరానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. లక్కవరానికి చెందిన నాగిరెడ్డి రాజబాబు, బయలపూడి నాగరాజు గాజువాకలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవారు. రష్యాలో ప్యాకింగ్‌ పనులు ఉన్నాయని, అక్కడికి వెళితే ఇంకా బాగా ఎక్కువ సంపాదించవచ్చని నేపాల్‌కు చెందిన దళారీ ఒకరు చెప్పడంతో, ఐదుగురు కలిసి ఈ ఏడాది జూలై ఏడో తేదీన విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లి అక్కడ నుంచి ఎనిమిదో తేదీన రష్యా చేరుకున్నారు.


ప్యాకింగ్‌ పనులు అంటూ తీసుకువెళ్లి, అక్కడ బలవంతంగా సిపాయిలుగా మార్చి యుద్ధక్షేత్రంలోకి నెట్టారని బాధితులు వాపోతున్నారు. తమతో రష్యా అధికారులు కాగితాలపై అగ్రిమెంట్లు చేయించుకుని ఇప్పుడు తాము రష్యా పౌరసత్వం కలిగిన వారమని, ఇండియాతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారంటూ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమను ఇండియాకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా రష్యాలో చిక్కుకున్న నాగిరెడ్డి రాజబాబుకు భార్య ముత్యాలమ్మ, ఒక బాబు, పాప ఉన్నారు. మరో యువకుడు బయలపూడి నాగరాజుకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముత్యాలమ్మ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తన భర్త నుంచి చివరిసారిగా సెప్టెంబరు 25న ఫోన్‌ కాల్‌ వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నదీ సమాచారం లేదని, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తన భర్తను కాపాడి రష్యా నుంచి ఇండియాకు తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

మంత్రి లోకేశ్‌ భరోసా

ఈ వీడియోపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ‘రష్యాలో చిక్కుకున్న మన పౌరుల పరిస్థితి చూస్తే బాధగా ఉంది. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడండి. వారికి అవసరమైన సాయం అందేలా చూడండి. వారు సురక్షితంగా ఇండియా వచ్చేలా చర్యలు చేపట్టండి’ అని తన కార్యాలయ సిబ్బందికి ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆ యువకులు మాట్లాడిన వీడియో కూడా షేర్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 05:14 AM