Share News

క్వాంటమ్‌.. కేరాఫ్‌ ఏపీ!

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:05 AM

ప్రపంచ భవిష్యత్‌ టెక్నాలజీ రంగంలో నవ్యాంధ్రను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా హస్తిన వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

క్వాంటమ్‌.. కేరాఫ్‌ ఏపీ!

  • అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ ఏఐ వర్సిటీ

  • క్వాంటమ్‌ ఏఐ సెంటర్‌, టాలెంట్‌ హబ్‌ ఏర్పాటు

  • విద్యాసంస్థల్లో ఏఐ అకాడమీలు.. ప్రతి విద్యార్థికీ ఏఐ ట్యూటర్‌

  • క్వాంటమ్‌, సైబర్‌ సెక్యూరిటీలో లక్ష మందికి శిక్షణ

  • ఏఐ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూలు

  • క్రియేటర్‌ ఎకానమీ సెంటర్‌గా ఏపీ.. యువ టెకీలు మా బలం

  • సమ్మిట్‌లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ భవిష్యత్‌ టెక్నాలజీ రంగంలో నవ్యాంధ్రను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా హస్తిన వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. క్వాంటమ్‌ టెక్నాలజీ అనగానే ముందుగా ఆంధ్రప్రదేశ్‌ పేరే వినిపించేలా రాష్ట్రాన్ని క్వాంటమ్‌ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసిన రాష్ట్రప్రభుత్వం... దానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి, రాష్ట్రంలో ఏఐ క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడానికి ఏడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. అమరావతిలో క్వాంటమ్‌ ఏఐ సెంటర్‌, అంతర్జాతీయ క్వాంటమ్‌ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ అకాడమీల ఏర్పాటు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీలో లక్ష మంది యువతకు శిక్షణ... అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ వివరాలు..


దేశంలోనే తొలి క్వాంటమ్‌ ఏఐ వర్సిటీ..

రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటుపై నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంప్‌సలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నిధులు సమకూర్చుతుంది. 10 ఎకరాల భూమి, క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ను రాష్ట్రం సమకూర్చాల్సి ఉంటుంది. కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌, ఎన్‌ఐఈఎల్‌ఐటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మదన్‌ మోహన్‌ త్రిపాఠి, కంట్రోలర్‌ జనరల్‌ డాక్టర్‌ అలోక్‌ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

క్వాంటమ్‌ ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

అమరావతిలో క్వాంటమ్‌ ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ (యూనీసీసీ)తో రాష్ట్రప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి క్వాంటమ్‌ ఏఐ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంవోయూలో పేర్కొన్నారు. ఒప్పంద కార్యక్రమంలో యూఎన్‌ఐసీసీ డైరెక్టర్‌ సమీర్‌ చౌహాన్‌, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


అమరావతిలో వైజర్‌ టాలెంట్‌ హబ్‌..

వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టెమ్‌, ఎంట్రపెన్యూర్‌షిప్‌ అండ్‌ రిసెర్చ్‌ (వైజర్‌) సంస్థ భాగస్వామ్యంతో అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌తో పాటు టాలెంట్‌ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తాజా ఒప్పందంతో ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది, 2027 నాటికి 6 లక్షల మందికి ఏఐ క్వాంటమ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో 35 లక్షల మందికి శిక్షణ ఇవ్వడమే ఈ ఒప్పంద లక్ష్యం. కాగా, ఏపీలోని 50కి పైగా ఉన్నతవిద్యా సంస్థలో ఏఐ అకాడమీలు, ఏఐ శాండ్‌బాక్స్‌ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీలో వచ్చే 3-5 ఏళ్లలో రాష్ట్రంలోని లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వం ఐబీఎంతో ఎంవోయూ కుదుర్చుకుంది. కార్యక్రమానికి ఐబీఎం ఇండియా ఎండీ సందీప్‌ పటేల్‌, ఆ సంస్థ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ బాలాజీ, ఐబీఎం రిసెర్చ్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్‌ అమిత్‌.. తదితరులు హాజరయ్యారు.


రాష్ట్రవ్యాప్త ఏఐ టెక్‌ హబ్‌..

ఐదంచెల ‘స్వదేశీ ఏఐ స్టాక్‌’ ఆధారంగా రాష్ట్ర స్థాయి ఏఐ టెక్‌ హబ్‌నిర్మించేలా భారత్‌జెన్‌, నెఎక్స్‌టీజెన్‌, ఐబీఎంతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానించే ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారత్‌జెన్‌ సీఈవో రిషిబాల్‌, ప్రతినిధి రామకృష్ణన్‌, నెఎక్స్‌టీ జెన్‌ సీఈవో రాజగోపాల్‌, ఐబీఎం రిసెర్చ్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్‌ అమిత్‌ సింఘీ పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థికీ ఏఐ ట్యూటర్‌..

పాఠశాల విద్యార్థులకు ఏఐ ట్యూటర్‌ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్‌, బోధన్‌ ఏఐతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ఏఐ ట్యూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఈ ఎంవోయూ కుదిరింది. ఈ ట్యూటర్‌ ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉంటూ, విద్యార్థులకు వ్యక్తిగత శిక్షణ అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కామ కోటి, ప్రొఫెసర్‌ మితేశ్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మినరల్స్‌లో ఏపీని కీలకంగా మారుస్తాం: కొల్లు

బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధి చేస్తాం: కందుల దుర్గేశ్‌

Updated Date - Feb 21 , 2026 | 06:29 AM