వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:56 AM
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతతో పాటు పదోన్నతులు కల్పించాలని వీబీజీరామ్‌జీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్ వద్ద ...
ఉద్యోగ భద్రతతో పాటు పదోన్నతులు కల్పించండి
పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ విజ్ఞప్తి
అమరావతి/తాడేపల్లి టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతతో పాటు పదోన్నతులు కల్పించాలని వీబీజీరామ్‌జీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్ వద్ద సామూహిక రాయబారం పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వీబీజీరామ్‌జీ డైరక్టర్ షణ్ముఖ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 19 సంవత్సరాలుగా తాము విధులు నిర్వహిస్తున్నప్పటికీ గత ఎనిమిదేళ్లుగా తమకు వేతనాలు పెరగలేదని, పెంచాలని కోరారు. మండలస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించాలని, పదోన్నతులు కల్పించాలని, మూడేళ్లు పూర్తిచేసిన వారికి ఎఫ్‌టీఈ వర్తింపచేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న 7500 పనిదినాల కల్పన నిబంధన ఎత్తేయాలని, ప్రమాదంలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో అందించాలని విజ్ఞప్తి చేశారు. షణ్ముఖ్‌కుమార్ మాట్లాడుతూ వీబీజీరామ్‌జీ సిబ్బందికి సంబంధించి సంస్కరణల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో శుభవార్త వింటారని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం