తండ్రి పేరు తప్పనిసరి కాకూడదు
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:27 AM
తండ్రి వివరాలు లేవనే కారణంతో ఏ బిడ్డకూ విద్య, గుర్తింపు పత్రాలు, సంక్షేమ పథకాలు, ఇతర కీలక సేవలు దూరం కాకూడదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఏపీఎస్‌సీపీసీఆర్) చైర్మన్ వేటుకూరి రాజు...
ప్రతి బిడ్డకూ స్వతంత్రంగానే హక్కులుంటాయ్
దీనిపై సమగ్ర పరిపాలనా సంస్కరణలు అవసరం
బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి రాజు వెల్లడి
విజయవాడ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): తండ్రి వివరాలు లేవనే కారణంతో ఏ బిడ్డకూ విద్య, గుర్తింపు పత్రాలు, సంక్షేమ పథకాలు, ఇతర కీలక సేవలు దూరం కాకూడదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఏపీఎస్‌సీపీసీఆర్) చైర్మన్ వేటుకూరి రాజు పేర్కొన్నారు. ప్రభుత్వ ఫారాలు, అధికారిక రికార్డుల్లో తండ్రి పేరు తప్పనిసరి కాకుండా చేసేందుకు సమగ్ర పరిపాలనా సంస్కరణలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. చిల్డ్రన్ ఇండియా ఫౌండేషన్, ఏపీఎస్‌సీపీసీఆర్ సంయుక్తంగా మంగళవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించాయి.
వేటుకూరి రాజు మాట్లాడుతూ ప్రతి బిడ్డకూ స్వతంత్రంగానే హక్కులు ఉంటాయని చెప్పారు. వారికి ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం, భవిష్యత్తు.. వారి తల్లిదండ్రుల వైవాహిక స్థితి, కుటుంబ పరిస్థితులు, సామాజిక హోదాపై ఆధారపడి ఉండకూడదన్నారు. దరఖాస్తుల్లో తండ్రి పేరు తప్పనిసరిగా వెల్లడించాలని ఒత్తిడి చేసినపుడు ఒంటరి తల్లుల పిల్లలు, అవివాహిత మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ బాధితులకు పుట్టిన సంతానం, ఇతరుల సంరక్షణలో నివసిస్తున్న పిల్లలు తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇలాంటి నిబంధనలు జనన ధ్రువీకరణ పత్రాలు, పాఠశాల ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, గుర్తింపు పత్రాలు, సంక్షేమ ప్రయోజనాలు పొందడంలో అడ్డంకులు సృష్టిస్తాయన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ పిల్లల కుటుంబ పరిస్థితులను పదే పదే ప్రశ్నించడం వల్ల వారిలో మానసిక ఆందోళన, అవమాన భావన కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంకే విజయలక్ష్మి, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామారావు, జువైనల్ వెల్ఫేర్ అధికారి రమణారెడ్డి తదితరులు ప్రసంగించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!