Share News

ఉద్యోగాల పేరుతో రూ.ఏడు కోట్ల మోసం

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:15 AM

జనసేన నాయకుడినని చెప్పుకొంటూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసిన వ్యవహారం గురువారం వెలుగు చూసింది

ఉద్యోగాల పేరుతో రూ.ఏడు కోట్ల మోసం

  • జనసేన నాయకుడినంటూ నిరుద్యోగులకు కుచ్చు టోపీ

  • మంగళగిరి రూరల్‌ పోలీసులకు ఆ పార్టీ నేతల ఫిర్యాదు

మంగళగిరి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జనసేన నాయకుడినని చెప్పుకొంటూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసిన వ్యవహారం గురువారం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన గగర ధరణి అనే యువకుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు. జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నానని చెప్పి తుని, ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన పలువురు నిరుద్యోగుల నుంచి సుమారు రూ.ఏడు కోట్ల మేర వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ధరణి మోసానికి పాల్పడినట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటున్న శివ శ్రీనివాస్‌, కోట రుక్మిణి సాయంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని.. ఇందుకోసం వారందరికీ వాటాలను ఇవ్వాలని నమ్మబలికి బాధితుల నుంచి నగదు వసూలు చేసినట్టు జనసేన రాష్ట్ర కార్యాలయానికి గత కొద్దిరోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నేతలు ఈ వ్యవహారం గురించి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే జనసేన పార్టీ నేతలు తమ పేర్లను వాడుకుని, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ధరణి మోసాలకు పాల్పడుతున్నట్టు స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ధరణి గతంలో జాబ్‌ కన్సల్టెన్సీ ఏజెన్సీలో పనిచేశాడని చెబుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి అచూకీ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్టు తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 05:17 AM