ప్రకృతి విపత్తులపై వైసీపీ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:53 PM
ఎల్-నినో ప్రభావం, సాగు-తాగునీటి పరిస్థితులపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి విపత్తులపై వైసీపీ రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించిన ఆయన.. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నెలల ముందే అప్రమత్తమైందని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 18: ఎల్‌నినో ప్రభావం.. సాగు-తాగునీటి పరిస్థితులపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి.. ప్రకృతి విపత్తుల వంటి అంశాలపై వైసీపీ రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం నెలల ముందే అప్రమత్తమైందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో సాగు.. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా గండికోట, కడప ప్రాజెక్టులకు నీటిని అందించడంతో పాటు హంద్రీ-నీవా ద్వారా మూడు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను కూడా సమర్థంగా వినియోగించుకున్నామని భూమిరెడ్డి వివరించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో పంటలపై ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా చర్యలు తీసుకుంటోందని తాజా ప్రభుత్వ సమీక్షల్లోనూ అధికారులు పేర్కొన్నారు.
ప్రకాశం మెట్ట ప్రాంతాల రైతుల చిరకాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలను అందించామని భూమిరెడ్డి తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం జరిగిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం మళ్లీ బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇస్తోందని, చిన్న రైతులకు 100 శాతం రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. హంద్రీ-నీవా ఆధునికీకరణకు రూ.3,500 కోట్లను కేటాయించి కుప్పం చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రకృతి పరిస్థితులను రాజకీయ కోణంలో చూడకుండా రైతులకు ఉపయోగపడే సూచనలు ఇవ్వాలని, ప్రజల్లో అనవసరమైన అభద్రతాభావాన్ని సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సూచించారు.
Also Read:
ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్‌పాల్ సింగ్
పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..