వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఈడీ పిలుపు
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:08 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. హత్యకు సంబంధించి నిందితులకు నగదు సమకూర్చడం...
వివేకా హత్య కేసులో నోటీసులు
నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశం
నిధుల మూలాలు, నగదు బదిలీలపై ఆరా
రేపు అవినాశ్‌రెడ్డి విచారణ!
అమరావతి/పులివెందుల, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. హత్యకు సంబంధించి నిందితులకు నగదు సమకూర్చడం, ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీపై దృష్టి సారించింది. ఈక్రమంలో వైఎస్ భాస్కర్‌రెడ్డికి సోమవారం నోటీసులు జారీ చేసిన ఈడీ.. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని బుధవారం విచారించనున్నట్లు సమాచారం. వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు నగదు ఎలా అందింది? నిధులు ఎక్కడి నుంచి సమకూరాయి? మధ్యవర్తుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నగదు చెల్లింపులకు సంబంధించిన ఆధారాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వివేకా హత్య కేసులో నిందితులకు నగదు సమకూర్చిన వ్యవహారంలో వైఎస్ భాస్కర్‌రెడ్డి పాత్రపై గతంలో సీబీఐ దర్యాప్తులో ఆరోపణలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై మరింత స్పష్టత కోసం ఈడీ విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. నిధుల మూలాలు, నగదు బదిలీల క్రమం, సంబంధిత వ్యక్తుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. భాస్కర్‌రెడ్డి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. వివేకా హత్య కేసులో ఇప్పటికే ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డిలను ఇప్పటికే ఈడీ విచారించింది.
ఈ వార్తలనూ చదవండి: