Share News

ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఈడీ నోటీసు

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:46 AM

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి నోటీసు జారీ చేశారు. మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన ఏ-7 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఈడీ నోటీసు

  • 14న విచారణకు రావాలని పిలుపు

  • వివేకా హత్యకు రూ.40 కోట్ల డీల్‌పై తుది దశకు దర్యాప్తు!

  • అవినాశ్‌ తండ్రి భాస్కర్‌రెడ్డినీ విచారించనున్న అధికారులు

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి నోటీసు జారీ చేశారు. మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన ఏ-7 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. హత్యకు కుదిరిన రూ.40 కోట్ల డీల్‌పై మనీలాండరింగ్‌ కోణంలో జరుగుతున్న విచారణకు ఆయన ఈ నెల 14వ తేదీన హాజరుకావాలని ఈడీ పేర్కొంది. మనీ ట్రయల్‌లో భాగంగా అప్రూవర్‌గా మారిన ఏ-4 దస్తగిరి, ఏ-2 సునీల్‌ యాదవ్‌, ఏ-1 ఎర్ర గంగిరెడ్డి, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డిలను విచారించి వాంగ్మూలాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ఈడీ దర్యాప్తు తుది అంకానికి చేరుకుందని అంటున్నారు. వివేకా హత్యకు రూ.40 కోట్ల డీల్‌ కుదిరిందని దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ పలు సందర్భాల్లో చెప్పడంతో.. రూ.5 కోట్ల అడ్వాన్స్‌, అందులో రూ.కోటి విడుదలకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. సునీల్‌ యాదవ్‌కు ఆ రూ.కోటి ఇచ్చిందెవరు..

దస్తగిరికి రూ.75 లక్షలు ఇవ్వమని అతడికి చెప్పిందెవరు? వీరికి డబ్బు ఎక్కడి నుంచి అందింది? ఎవరికి ఎలా చేరింది.. హత్యకు ముందు, తర్వాత ఎంతెంత ఇచ్చారు.. ఇందులో ఏ-7 ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి(ఏ-8)ల పాత్ర ఏమిటో వారు నిశితంగా ఆరా తీస్తున్నారు. మనీ ట్రయల్‌లో ముందుగా దస్తగిరి వాంగ్మూలం నమోదు చేశారు. తర్వాత సునీల్‌ యాదవ్‌ను విచారించి అతని స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. వీరిద్దరూ చెప్పిన అంశాలు, వివరాల ఆధారంగా ఎర్రగంగిరెడ్డిని, ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇచ్చిన వాంగ్మూలాలు, నగదు, బ్యాంకు లావాదేవీలు, సీసీ ఫుటేజ్‌లను ముందుపెట్టి..వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఆ సమాచారం ఆధారంగా అవినాశ్‌రెడ్డిని ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత భాస్కర్‌రెడ్డిని సైతం పిలుస్తారని తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 03:46 AM