ఆ 40 కోట్ల సంగతేంటి?
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:44 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు రూ.40 కోట్ల మనీడీల్ జరిగిందన్న వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి(ఏ-8)ని బుధవారం సుదీర్ఘంగా విచారించారు.
ఆ డబ్బు ఎలా వచ్చింది.. ఎవరికెంత ఇచ్చారు?
వివేకా హత్య కేసులో మనీడీల్పై వైఎస్ అవినాశ్‌రెడ్డికి ఈడీ ప్రశ్నలు
తనకేమీ తెలియదన్న కడప ఎంపీ
ఈడీ ఆధారాలు చూపడంతో నీళ్లు నమిలిన వైనం
ఆరు గంటల సుదీర్ఘ విచారణ
నేడూ రావాలని ఈడీ ఆదేశం
అమరావతి/హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు రూ.40 కోట్ల మనీడీల్ జరిగిందన్న వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి(ఏ-8)ని బుధవారం సుదీర్ఘంగా విచారించారు. ‘రూ.40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా సమకూర్చారు.. ఎవరికి ఎంత చేరింది.. ఏయే మార్గాల్లో బదిలీ జరిగింది..’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇంతవరకు అప్రూవర్ దస్తగిరి (ఏ-4), ఎర్ర గంగిరెడ్డి (ఏ-1), సునీల్ యాదవ్(ఏ-2), ఉమా శంకర్‌రెడ్డి(ఏ-3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ-5), అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి(ఏ-7)లను ఈడీ విచారించింది. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న అంశాలతో పాటు దస్తగిరి, సునీల్ యాదవ్ కీలక విషయాలు వెల్లడించారు. వారి వాంగ్మూలాలతో పాటు దర్యాప్తులో తాము సేకరించిన వివరాల ఆధారంగా అవినాశ్‌రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఏదడిగినా తనకు తెలీదంటూ ఆయన ఒకే సమాధానం ఇవ్వగా..
కొన్ని కీలక ఆధారాలను ఆయన ముందుంచి వారు ప్రశ్నించినట్లు తెలిసింది. ’వివేకాను చంపెయ్.. నువ్వొక్కడివే కాదు.. మేమూ నీతో వస్తాం.. మా వెనుక వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారు.. ఈ హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడు.. అందులో రూ.5 కోట్లు నీ వాటా’ అంటూ ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి ఇచ్చిన హామీ, దస్తగిరికి ఇచ్చిన అడ్వాన్స్ గురించి సంగతేంటని అడిగినట్లు సమాచారం. అవన్నీ తనకు తెలియవని అవినాశ్ చెప్పడంతో.. ‘వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది.? శివశంకర్‌రెడ్డి మీకు అన్ని విధాలా దగ్గరి అనుచరుడు.. తెలీదంటే ఎలా..’ అని ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. వివేకానందరెడ్డి హత్య (2019 మార్చి 15)కు ముందు జరిగిన పలు బ్యాంకు లావాదేవీల లావాదేవీల గురించీ ఆరా తీశారు.
అవన్నీ తమ ఆడిటర్ చూసుకుంటారని, తనకు గుర్తు లేదని అవినాశ్ బదులిచ్చినట్లు తెలిసింది. హత్యకు ముందు, ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు, సహ నిందితులతో అవినాశ్‌రెడ్డి ఫోన్ సంబాషణలు, సహ నిందితులకు అడ్వాన్స్‌గా చెల్లించిన సొమ్ము గురించి ఆధారాలతో ప్రశ్నించగా ఎంపీ నీళ్లు నమిలినట్లు సమాచారం. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను సాయంత్రం 5 గంటలవరకు విచారించారు. ఆ తర్వాత ఆయన మీడియా కంటపడకుండా ఈడీ కార్యాలయం వెనుక గేటు నుంచి వెళ్లిపోయారు. తొలి రోజు విచారణలో ఆయన సరిగా సహకరించలేదని.. ఈ క్రమంలో గురువారం కూడా రావాలని ఈడీ అధికారులు పిలిచినట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టు 21న అవినాశ్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపిన క్రమంలో రూ.24 లక్షల నగదును ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లను ఈడీ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ఆర్థిక లావాదేవీల మూలాలు, సేకరించిన నిధుల మార్గాలు, అవి ఎవరిని చేరాయో మరింత సమగ్రంగా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..