Share News

వివేకా హత్య తర్వాత మీ ఇంట్లో ఏం జరిగింది?

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:37 AM

మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. హత్యకు రూ.40 కోట్ల డీల్‌ కుదిరిందని..

వివేకా హత్య తర్వాత మీ ఇంట్లో ఏం జరిగింది?

  • ఆ భేటీకి ఎవరెవరు వచ్చారు?.. రూ.40 కోట్ల డీల్‌లో ఎవరికెంత ముట్టాయి?

  • ఏ-1 గంగిరెడ్డికి ఈడీ సూటిప్రశ్నలు.. ఏయే దశల్లో నిధుల బదిలీ జరిగింది?

  • అంతా నగదు రూపంలోనేనా.. లేక ఆన్‌లైన్‌ బదిలీలు జరిగాయా?

  • రెండ్రోజుల్లో 16 గంటలపాటు విచారణ.. ఏ-3 ఉమాశంకర్‌రెడ్డిని కూడా..

  • హత్య తర్వాత గోడ దూకి పారిపోతున్న సీసీ ఫుటేజీ చూపించిన అధికారులు

  • త్వరలోనే అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలకూ పిలుపు?

హైదరాబాద్‌/అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. హత్యకు రూ.40 కోట్ల డీల్‌ కుదిరిందని.. విడతల వారీగా డబ్బు బదిలీ జరిగిందని ఈ కేసులో అరెస్టయిన నిందితులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి(ఏ-4), ఏ-2 సునీల్‌ యాదవ్‌ను పలుమార్లు ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఏ-1 ఎర్రగంగిరెడ్డి, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డిలను సోమ, మంగళ వారాల్లో దాదాపు 16 గంటలు విచారించారు. ‘2019 మార్చి 14 అర్ధరాత్రి తర్వాత వివేకా హత్య జరిగింది. 15వ తేదీన నిందితుల్లో కొందరు మీ ఇంట్లో సమావేశమైనట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. అసలా రోజు ఏం జరిగింది’ అని ఏ-1 ఎర్రగంగిరెడ్డిని ప్రశ్నించారు. ఆ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు..


ఏం చర్చించారు.. హత్యకు కుదుర్చుకున్న 40 కోట్ల డీల్‌.. వాటాల పంపకం తదితర అంశాల గురించి అడిగినట్లు తెలిసింది. వివేకా హత్య తర్వాత ఉమాశంకర్‌రెడ్డి గోడ దూకి పారిపోతున్న సీసీ ఫుటేజీ చూపించి అతడిని ప్రశ్నించారని.. కీలక సమాచారాన్ని రాబట్టారని సమాచారం. హత్యకు నాలుగైదు రోజుల ముందు దస్తగిరికి సునీల్‌ యాదవ్‌ రూ.75 లక్షలిచ్చాడని.. మరో రూ.25 లక్షల నగదు తన వద్దే ఉంచుకున్నాడని ఇప్పటికే సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దస్తగిరికి రూ.5 కోట్లు ఇస్తామని, అడ్వాన్స్‌గా రూ.కోటి సునీల్‌ ద్వారా నిందితులు పంపారన్న విషయంపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా ఆ రూ.కోటి ఎవరి నుంచి సునీల్‌కు అందింది.. రూ.40 కోట్ల నిధుల మూలాలెక్కడివి.. హత్య డీల్‌ తర్వాత ఏయే దశల్లో నిధుల బదిలీ జరిగింది? అంతా నగదు రూపంలోనేనా.. లేక ఆన్‌లైన్‌ బదిలీలు జరిగాయా’ అని ఉభయులనూ ప్రశ్నించారు. హత్యకు దారితీసిన పరిణామాలు, అంతకుముందు ఎవరెవరితో గంగిరెడ్డి చర్చించాడు.. ఉమాశంకర్‌రెడ్డి ఇందులోకి ఎలా ప్రవేశించాడనేదానిపైనా ఆరా తీసినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకుదాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పినా.. ఇప్పటికే సేకరించిన ఆధారాలు, సీసీ ఫుటేజీ దృశ్యాలు, కాల్‌ డేటాను ఎదుటపెట్టి ప్రశ్నించడంతో.. గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి కీలక సమాచారాన్ని బయటపెట్టినట్లు సమాచారం. దీని ఆధారంగా అతి త్వరలో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి(ఏ-7)ని, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి(ఏ-8)ని ఈడీ పిలిపించనున్నట్లు తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 03:38 AM