మద్యం టెండర్ల వెనుక ఎవరున్నారు?
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:23 AM
గత వైసీపీ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్, అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్...
బ్రాండ్ల ఎంపిక, కొనుగోళ్లలో పాత్ర ఎవరిది?
ధరల నిర్ణయం వెనుక ఎవరున్నారు?
రజత్ భార్గవకు ఈడీ ప్రశ్నల వర్షం
మనీ లాండరింగ్ కోణంలోనూ ఆరా
మాజీ ఐఏఎస్ వాంగ్మూలం నమోదు
అమరావతి/హైదరాబాద్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్, అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ను బుధవారం సుదీర్ఘంగా విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మద్యం పాలసీ రూపకల్పన, కొనుగోళ్లు, బ్రాండ్ల ఎంపిక, ధరల నిర్ణయం, ఆర్డర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో చోటుచేసుకున్న అక్రమాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. 2019-24 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్పై దృష్టి పెట్టారు. మద్యం సరఫరా సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం, కొన్ని బ్రాండ్లకు మాత్రమే ప్రాధాన్యం కల్పించడం, ధరల నిర్ణయం వెనుక ఉన్న వ్యవహారాలతోపాటు, అక్రమంగా సమకూరిన నిధులపై ఈడీ దృష్టి సారించింది. వైసీపీ హయాంలో రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా వ్యవహరించిన నేపథ్యంలో ఆ సమయంలో అమల్లో ఉన్న మద్యం విధానం, సరఫరా ఆర్డర్ల జారీ, బ్రాండ్లకు అనుమతులు, ధరల మార్పులు, రవాణా టెండర్లకు సంబంధించిన నిర్ణయాలపై ఆయన నుంచి వివరాలు ేసకరించినట్టు తెలిసింది. పరిపాలనా స్థాయిలో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారు?. వాటికి అనుసరించిన విధానాలేమిటి?. అభ్యంతరాలు వ్యక్తమయ్యాయా?. అనే అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి.
కోర్టులోనూ కీలక వాంగ్మూలం
ఇటీవల విజయవాడ న్యాయస్థానంలో రజత్ భార్గవ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మద్యం బ్రాండ్లకు సంబంధించిన ఇండెంట్లు, ఓఎఫ్ఎస్ అధికారాల మార్పులు, అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి వచ్చిన ఒత్తిళ్లపై ఆయన వివరించినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. కొన్ని నిర్ణయాలపై తాను అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోర్టులో వెల్లడైన అంశాలు, సిట్ దర్యాప్తులో సేకరించిన సమాచారం, ఆర్థిక లావాదేవీల మధ్య సంబంధాన్ని ఈడీ పరిశీలించే అవకాశముంది. మద్యం కుంభకోణంలో అక్రమంగా సమకూరిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది?. ఎవరెవరికి చేరింది?. వివిధ వ్యక్తులు, సంస్థల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందా?. ఆ లావాదేవీలకు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో సంబంధం ఉందా?. అనే అంశాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..