Share News

మళ్లీ ఈడీ ముందుకు శివశంకర్‌రెడ్డి

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:33 AM

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ కాంట్రాక్టు జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు తాజాగా మరోసారి కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని విచారించారు.

మళ్లీ ఈడీ ముందుకు శివశంకర్‌రెడ్డి

  • 8 గంటలు ప్రశ్నించిన అధికారులు

  • వివేకా హత్యకు మనీ డీల్‌పై మరింత ఆరా

  • 2 విడతల్లో 19 గంటలు ప్రశ్నలు

  • అవసరమైతే మళ్లీ రావాలని ఆదేశం?

  • అవినాశ్‌నూ మరోసారి ప్రశ్నించే అవకాశం

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ కాంట్రాక్టు జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు తాజాగా మరోసారి కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని విచారించారు. గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో 8 గంటల పాటు దేవిరెడ్డిని ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. తొలి విడత ఈ నెల 12న శివశంకర్‌ రెడ్డిని దాదాపు 11 గంటలు పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరికొన్ని పత్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు తీసుకుని రావాలని ఆదేశించారు. దీంతో ఆయన గురువారం ఈడీ ముందు హాజరయ్యారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు దేవిరెడ్డిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

వివేకా హత్యకు నెల ముందే శివశంకర్‌ రెడ్డి, ఆయన సన్నిహితులు.. వివేకాను హత్య చేస్తే భారీ మొత్తం ఇస్తామని ఇతర నిందితులకు హమీ ఇచ్చారని ఇప్పటికే సీబీఐ ఆరోపించింది. మరోవైపు హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, పోలీసు అధికారులను మౌనంగా ఉండమన్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇవేకాకుండా డబ్బు ఆశ చూపించి కీలక సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆయనపై సీబీఐ ఆరోపణలు చేసింది. శివశంకర్‌ రెడ్డి ద్వారానే రూ.40 కోట్లు ఇస్తామనే ఆఫర్‌ వచ్చిందని నిందితుల్లో కొందరు ఇప్పటికే ఈడీకి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆయన ద్వారానే తొలి విడతలో దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ తదితరులకు పంపిణీ అయిన డబ్బుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను ఈడీ సేకరించింది. ఈ క్రమంలో దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని ఈడీ అధికారులు నిశితంగా క్రాస్‌ చెక్‌ చేస్తున్నారని సమాచారం. ‘శివశంకర్‌ రెడ్డి ద్వారా మీకు డబ్బు అందుతుందని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు. అందులో భాగంగానే సునీల్‌ యాదవ్‌ ద్వారా నాకు రూ.కోటి పంపించారు. అందులో నుంచే సునీల్‌ రూ.25 లక్షలు తీసుకున్నాడు’ అని అప్రూవర్‌ దస్తగిరి ఈడీకి వాంగ్మూలం ఇచ్చాడు.


ఈ క్రమంలో అసలు రూ.40 కోట్ల ఆఫర్‌ వెనుక ఉన్నదెవరు? శివశంకర్‌ రెడ్డి ఇందులో ముఖ్య అనుమానితులైన ఎంపీ అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిలకు మధ్యలో మాత్రమే ఉన్నారా? లేక చీకటి కోణంగా మిగిలిపోయిన మరో ప్రధాన అనుమానితుడితో టచ్‌లో ఉన్నారా? డబ్బు రూటింగ్‌ ఎలా జరిగింది? అనే విషయాలను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అవినాశ్‌ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. కొన్ని బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఇతరత్రా కొన్ని ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన పత్రాలు అందజేయాలని చెప్పారు. దీంతో ఆయన సొంతూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అవినాశ్‌ రెడ్డిని మరోసారి ఈడీ అధికారులు త్వరలో ప్రశ్నించే అవకాశాలున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:33 AM