గ్రూప్-1పై ఈడీ నజర్
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:25 AM
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది.
‘దిద్దుబాట్ల’లో.. ఆర్థిక లావాదేవీలపై ఆరా
మనీలాండరింగ్ కోణంలో తదుపరి చర్యలు
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది. ఈ కేసులో రాష్ట్ర పోలీసులు ఇప్పటికే సేకరించిన వివరాలతో పాటు సీఐడీ ఇచ్చిన నివేదికను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. మూల్యాంకనంలో అక్రమాలతో పాటు ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా?. మనీ లాండరింగ్ ఉందా?. అనే కోణంలో ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆధారాలు లభించగానే తదుపరి చర్యలు చేపట్టనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను హాయ్ల్యాండ్లో మూల్యాంకనం చేయించారు. అనంతరం విజయవాడలోనూ మాన్యువల్గా మూల్యాంకనం చేశారు. ఈ క్రమంలో భారీ గా అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ నివేదిక ఇచ్చింది.
దీనికి ముందు ఏపీపీఎ్ససీ ఫిర్యాదు మేరకు విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీపీఎస్సీ మాజీ సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు మరికొందరిపై ఐపీసీ సెక్షన్లు 409(నమ్మకద్రోహం), 420(మోసం), 477-ఏ(రికార్డుల తారుమారు), 120-బీ(నేరపూరిత కుట్ర), ఐటీ చట్టంలోని సెక్షన్ 34 కింద దర్యాప్తు చేపట్టారు. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. సిట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. ఏపీపీఎ్ససీ నుంచి ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నిధులు విడుదల చేసినట్లు తేలింది. మరోవైపు అభ్యర్థులకు మార్కులు ఇష్టారాజ్యంగా వేశారనే ఆరోపణలకు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను సేకరించిన ఈడీ అధికారులు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు