Share News

హాయ్‌ల్యాండ్‌లోనే 84 రోజులు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:39 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముమ్మరం చేసింది.

హాయ్‌ల్యాండ్‌లోనే 84 రోజులు

  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 జవాబుపత్రాలు!

  • మాన్యువల్‌ మూల్యాంకనంలోనూ ‘డిజిటల్‌’ మార్కులే

  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మూల్యాంకనంలో భారీ కుంభకోణం

  • హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, గుంటూరుల్లో ఈడీ సోదాలు

  • కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలు, ఇతర ఆధారాలు స్వాధీనం

  • మాజీ కార్యదర్శి పీఎస్సార్‌, పలువురి వాంగ్మూలాలు నమోదు

  • రూ.1.14 కోట్ల అక్రమ చెల్లింపులపై పీఎల్‌ఎంఏ కేసు విచారణ

హైదరాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా గతవారం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు గుంటూరు జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈడీ హైదరాబాద్‌ విభాగం అధికారులు మంగళవారం బహిర్గతం చేశారు.

‘ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్‌ మూల్యాంకనాన్ని రద్దుచేసి, మాన్యువల్‌ మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఏపీపీఎస్సీకి పూర్తిస్థాయి రెగ్యులర్‌ చైర్మన్‌ లేని సమయంలో అప్పటి కార్యదర్శి పీఎస్సార్‌ చేతిరాత మూల్యాంకన బాధ్యతలను క్యామ్‌సైన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి జవాబు పత్రాలను గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌కు తరలించారు. 2021 నవంబరు 27 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు ఏకంగా 84 రోజుల పాటు వాటిని అక్కడే ఉంచారు. వాస్తవానికి జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనం జరగనేలేదు. గతంలో డిజిటల్‌ విధానంలో ఇచ్చిన మార్కులనే చేతిరాత మూల్యాంకనంలో వచ్చినట్లుగా నమోదు చేశారు’ అని ఈడీ ఆరోపించింది. 2022 జనవరి 1న మూల్యాంకన ప్రక్రియ తుదిదశకు చేరుకుందని బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేసింది.


అనంతరం అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి సంతకంతో 2022 ఫిబ్రవరి 16న చెక్‌ నం.197469 ద్వారా సదరు ప్రైవేటు సంస్థకు రూ.1,14,32,312 చెల్లించారని వివరించింది. అయితే ఫిబ్రవరి 19 తర్వాత మొత్తం ప్రక్రియను రద్దుచేసి, జవాబుపత్రాలను తిరిగి ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకొచ్చినట్లు వివరించింది. అక్కడ సీసీటీవీ నిఘా మధ్య మరోసారి మూల్యాంకనం నిర్వహించి, ఆ మార్కుల ఆధారంగానే తుది ఫలితాలు, ఎంపిక జాబితాను ప్రకటించినట్లు వెల్లడించింది. మూల్యాంకనం పేరుతో చెల్లించిన రూ.1.14 కోట్లకు సంబంధించి ఎలాంటి సేవలు అందించినట్లు ఆధారాల్లేవని ఈడీ స్పష్టం చేసింది.

పలువురి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు

ఈ కేసులో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పి. సీతారామాంజనేయులు, మూల్యాంకన బాధ్యతలు చేపట్టిన క్యామ్‌సైన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ, దాని మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి. మధుసూదన్‌రావు, గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌, గతంలో డిజిటల్‌ మూల్యాంకనం నిర్వహించిన స్టోన్‌ మీడియా అడ్వైజరీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఇన్‌గ్రేడర్‌ సర్వీసె్‌సకు సంబంధించిన వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:41 AM