భారతీ సిమెంట్స్‌కు గనుల అక్రమ లీజు..
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:01 AM
జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌కు చట్టవిరుద్ధంగా గనులు లీజుకిచ్చిన వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నాటి గనుల శాఖ కార్యదర్శి బి.కృపానందాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు రాష్ట్రప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది.
రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం ప్రాసిక్యూషన్‌కు ఓకే
ఈడీకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి
ఆయన గనుల శాఖ కార్యదర్శిగా ఉండగా
జగన్‌కు లబ్ధి చేకూర్చడానికి ఆరాటం
భారతీ సిమెంట్స్ గనుల లీజులో తీవ్ర ఉల్లంఘన
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌కు చట్టవిరుద్ధంగా గనులు లీజుకిచ్చిన వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నాటి గనుల శాఖ కార్యదర్శి బి.కృపానందాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు రాష్ట్రప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు కృపానందం గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌కు లబ్ధి చేకూర్చేందుకు ఆయన తెగ ఆరాటపడ్డారు.. అంబుజా సిమెంట్స్ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ రద్దు చేసి.. భారతీ సిమెంట్స్‌కు మైనింగ్ లీజు కట్టబెట్టడంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.. జగన్ అక్రమాస్తులు పోగేసుకోవడానికి కడప జిల్లాలోని సున్నపురాయి గనులను అక్రమంగా ఆయన కంపెనీకి అప్పగించారు.. అక్రమాస్తులను చట్టబద్ధమైనవిగా చూపించుకోవడానికి జగన్‌కు పూర్తి సహకారం అందించారు.
తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్ కడప జిల్లాలో రఘురాం సిమెంట్స్‌ను టేకోవర్ చేసి భార్య పేరుతో భారతీ సిమెంట్స్‌గా మార్చి.. అక్కడి సున్నపురాయి గనులను అక్రమంగా లీజుకు తీసుకున్నారు. గుజరాత్‌కు చెందిన అంబుజా సిమెంట్స్ అప్పటికే అన్ని అర్హతలతో పొందిన సున్నపురాయి గనులను.. ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఒకే ఒక్క మెమో(2005 అక్టోబరు 31)తో రద్దు చేశారు. అంబుజా నుంచి వచ్చిన అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండగానే.. సున్నపురాయి గనులను 2006 మార్చి 7న భారతీ సిమెంట్స్‌కు అప్పగించారు. అప్పటి గనుల శాఖ మంత్రి (పి.సబితా ఇంద్రారెడ్డి) ఆమోదం లేకుండా.. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి మరీ కట్టబెట్టారు. ఈ అక్రమాలపై 2011 ఆగస్టు 30న ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు.. దర్యాప్తులో భాగంగా కృపానందం పాత్రపై ఆధారాలు సేకరించారు.
జగన్‌తో పాటు ఇతర నిందితులతో కలిసి కృపానందం అధికార దుర్వినియోగానికి పాల్పడిన తీరు, భారతీ సిమెంట్స్‌కు అనుచిత ప్రయోజనాలు కల్పించిన వైనాన్ని వివరిస్తూ ఈ కేసులో 18వ నిందితుడిగా చేర్చారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 3 కింద మనీలాండరింగ్ నేరారోపణపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ 2026 సెప్టెంబరు 10న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈడీ లేఖను పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం సీఆర్‌పీసీ సెక్షన్ 197(1)కు అనుగుణంగా కృపానందం ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైదరాబాద్‌లోని ఈడీ అధికారులు అక్కడి ప్రత్యేక కోర్టును ఆశ్రయించి.. జగన్‌కు అక్రమంగా మైనింగ్ లీజు కట్టబెట్టిన కృపానందంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు