కల్తీ నెయ్యి కేసులో130 కోట్ల ఆస్తులు అటాచ్
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:42 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో హైదరాబాద్ జోన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన రూ.130 కోట్ల విలువైన ..
తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఈడీ కొరడా
భోలేబాబా, వైష్ణవి, సుకృతి ఫుడ్స్‌పై చర్యలు
ఇప్పటికే బ్యాంకు ఖాతాలు, 2.70 కోట్ల నగదు సీజ్
గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యు సరఫరా టెండర్
టీటీడీకి 234 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా
ప్రధాన నిందితులు విపిన్ జైన్, కైలాష్ చంద్‌ను ఇదివరకే అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
అమరావతి/తిరుపతి/హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో హైదరాబాద్ జోన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన రూ.130 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులను జప్తు చేసింది. వీటిలో ఆయా సంస్థల్లోని కీలక వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల్లో నిల్వలు, రూ.2.70 కోట్ల నగదు సీజ్ చేసినట్లు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి గత వైసీపీ ప్రభుత్వంలో భోలేబాబా డెయిరీ, సుకృతి ఫుడ్స్, శ్రీ వైష్ణవి డెయిరీలు నెయ్యు సరఫరా టెండర్ దక్కించుకున్నాయి. అయితే, రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా చేశాయి.
టీటీడీ టెండర్లలో ఇతర సంస్థలు పాల్గొన్నా.. వాస్తవంగా నెయ్యి తయారీ మాత్రం భోలేబాబా, సుకృతి ఫుడ్స్‌లో జరిగినట్లు ఈడీ దర్యాప్తులో తేల్చింది. శుద్ధి చేసిన పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి కెమికల్స్‌తో నెయ్యి లాంటి ద్రవాన్ని ఉత్పత్తి చేసినట్లు తేలింది. ఈ ముడి పదార్థాలను వంట నూనెలుగా ఇవ్వాయి్సలు జారీ చేసి, నెయ్యి తయారీలో అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. కల్తీ నెయ్యి తయారీ, సరఫరా వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు నెయ్యి సరఫరా సంస్థల ఖాతాల్లో కమీషన్ల కోసం తప్పుడు లావాదేవీలు సృష్టించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. పాలు, నెయ్యి కొనకుండానే కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. అంతేగాక వెన్నతీసిన పాలు వంటి ఉప ఉత్పత్తులను విక్రయించినట్లు లెక్కల్లో చేసిన మాయాజాలాన్ని ఈడీ అధికారులు గుర్తించారు.
కేసులో హవాలా కోణం..
కల్పిత కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపి, అనంతరం ఆ మొత్తాలను హవాలా మార్గంలో నగదు రూపంలో నిందితులు వెనక్కి తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ నగదుతో కెమికల్ పామాయిల్ కొనుగోలు చేసి విక్రయదారులకు చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. గత ప్రభుత్వంలోని పెద్దలకు లంచాలు, టీటీడీ టెండర్లలో తమతో పోటీపడిన డెయిరీ సంస్థలకు ఒప్పందం మేరకు డబ్బులు ఇచ్చినట్లు కనుగొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన విపిన్ జైన్(భోలేబాబా ప్రమోటర్), కైలాశ్ చంద్ మంగ్లా(సుకృతి ఫుడ్స్ ప్రమోటర్)ను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన సీబీఐ దర్యాప్తు బృందం ఛేదించిన ఈ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి గత జూన్ 3న ఉత్తరాఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర 16 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ప్రధాన నిందితులు, టెండర్లలో ముందున్న డెయిరీ సంస్థలు, రసాయనాల సరఫరాదారులతో పాటు తప్పుడు ఆర్థిక లావాదేవీలకు సహకరించిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.70 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు.
టీటీడీకి వందల కోట్ల నష్టం
పామాయిల్‌తో పాటు కొన్ని రసాయనాలు కలిపి నెయ్యి తయారు చేసి అసలైన నెయ్యిగా టీటీడీకి సరఫరా చేయడం వల్ల దేవస్థానానికి రూ.234.5 కోట్ల నష్టం జరిగిందని ఈడీ అధికారులు తెలిపారు. భోలేబాబా కంపెనీ తెర ముందుండి వ్యవహారాన్ని నడిపిందని పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ అధికారులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..