బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:13 AM
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి తీసుకొస్తున్న విదేశీ బంగారం తెలుగు రాష్ట్రాలకు తరలుతోంది. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌పై
కోల్‌కతా నుంచి తరలిస్తున్న 5.83కిలోలు విశాఖలో పట్టివేత
ఇద్దరు అరెస్ట్.. ముఠా నెట్‌వర్క్‌పై డీఆర్‌ఐ ఆరా
అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి తీసుకొస్తున్న విదేశీ బంగారం తెలుగు రాష్ట్రాలకు తరలుతోంది. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) దృష్టి సారించింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో బంగారం తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో డీఆర్‌ఐ అధికారులు ఈ నెల ఎనిమిదో తేదీ అర్ధరాత్రి సమయంలో విశాఖ నగరంలో జాతీయ రహదారిపై మాటువేశారు. తొమ్మిదో తేదీ తెల్లవారుజామున కోల్‌కతా వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు.
డ్రైవర్ పక్కసీటులో కాళ్లు పెట్టుకునే చోట ఏర్పాటుచేసిన ప్రత్యేక అరలో మూడు ప్యాకెట్లలో దాచిపెట్టిన 5.83 కిలోల బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు దాటించి కోల్‌కతాకు చేర్చారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైనట్టు అధికారులు తెలిపారు. ఈ విదేశీ బంగారం విలువ మన రాష్ట్రంలో రూ.8.98కోట్లు ఉంటుందని చెప్పారు. బంగారంతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారిని కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా.. పెద్ద మొత్తంలో బంగారాన్ని తరచూ మన దేశంలోకి అక్రమంగా తీసుకొస్తున్న ముఠా వివరాలతో పాటు ఎక్కడ సరిహద్దు దాటుతోంది? తీసుకొచ్చిన వ్యక్తులెవరు? అందుకున్న మధ్యవర్తులు ఎవరు? ఇక్కడ రవాణాకు ఏర్పాట్లు చేసిందెవరు? హైదరాబాద్‌లో ఈ బంగారాన్ని ఎవరు తీసుకుని ఎలా విక్రయిస్తున్నారు? తదితర వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు.
బంగ్లాదేశ్ నుంచి రైలు, రోడ్దు మార్గం ద్వారానే గతంలో కోల్‌కతాకు తీసుకొచ్చిన ఉదంతాలు డీఆర్‌ఐ కేసుల్లో ఎక్కువగా ఉన్నాయి. సరకు రవాణా వాహనాల్లో రహస్యంగా తీసుకొచ్చి మన దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకొంటున్న ముఠా నెట్‌వర్క్ ఏర్పాటుచేసుకుం ది. సమాచారం సేకరించిన డీఆర్‌ఐ అధికారులు.. హైదరాబాద్‌లో రిసీవర్ల ఆర్థిక లావాదేవీలతో కూడిన నెట్‌వర్క్ మూలాలను వెలికితీసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్