రాజధాని అమరావతి అజేయం
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:05 AM
ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడం శుభపరిణామం...
కూటమి సంబరాల్లో జనసేన నేతలు భాగస్వాములు కావాలి
పీఎం, సీఎంలకు కృతజ్ఞతలు తెలుపుతూప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలి: డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, ఏప్రిల్ 2: ‘ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడం శుభపరిణామం. రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకొనే ఆనందకర తరుణం వచ్చింది. ఇకపై రాజధానిగా అమరావతి అజేయం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘ఈ బిల్లుకు మద్దతు పలికిన పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. రాష్ట్రానికి రాజధాని నగరం ఉండడమే ఇష్టం లేని వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలెవరూ పట్టించుకోవలసిన అవసరం లేదు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సదరు వ్యక్తుల నైజం మరోమారు బయటపడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ముందుకు తీసుకువెళ్లడంతోపాటు, రాజధాని నగర అభివృద్ధికి బలమైన తోడ్పాటు ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ తరుణంలో రాష్ట్రంలో కూటమి పక్షాలు చేసే సంబరాల్లో భాగస్వాములు కావాలని జనసేన నేతలకు, శ్రేణులకు పిలుపునిస్తున్నా. మన రాజధాని అమరావతికి తోడ్పాటు ఇచ్చిన మోదీకి, అపార అనుభవంతో రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించాలని కోరుతున్నా’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.