డోలీ మోతల్లేని గ్రామాలే లక్ష్యం
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:44 AM
డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలే తన లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతమైన కాకవాడ గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు.
గిరిజనులు స్థానికంలో సత్తా చాటాలి
సెల్‌టవర్లు, రోడ్లు, స్కూళ్లు.. అన్నీ ఇస్తాం
‘అడవి తల్లి బాట 2.0’ సభలో పవన్
రాజమహేంద్రవరం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలే తన లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతమైన కాకవాడ గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి, వారు తయారుచేసిన వెదురుబొంగు వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. వారికి మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం.. రూ.2,055 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 1341 ఆవాసాలకు 1976 కిలోమీటర్ల మేర రోడ్లతో పాటు 45 వంతెనల నిర్మాణానికి ఉద్దేశించిన అడవితల్లి బాట 2.0కు శ్రీకారం చుట్టారు. అడవితల్లి బాట మొదటి దశలో 858 గిరిజన ఆవాసాలకు 1,662 కిమీ రహదారుల కోసం రూ.1406 కోట్ల పనులు చేపట్టామని.. ఇప్పటికి 753 ఆవాసాల్లో 1282 కిలోమీటర్ల రహదారులు పూర్తి చేశామని.. మిగిలిన పనులను వచ్చే మార్చి నాటికి పూర్తిచేసేలా ముందుకుపోతున్నామని పవన్ తెలిపారు.
‘2024లో నేను ఒక్కమాట మీకు చెప్పి కూటమికి నేను అండగా ఉన్నాను. మీరు మమ్మల్ని గెలిపించారు. దానికి ప్రతిఫలమే ఈరోజు అడవితల్లి బాట’ అని చెప్పారు. సీఎం చంద్రబాబు అపారమైన అనుభవంతో.. డబ్బులున్నా లేకపోయినా.. ప్రభుత్వాన్ని సమర్థతతో నడుపుతున్నారని.. గిరిజనులు కోరుతున్న అభివృద్ధి పనులు, సెల్‌టవర్లు.. అన్నీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని.. ఎంతో చేస్తున్నాం కూడా అని తెలిపారు. రాష్ట్రం మొత్తమ్మీద రూ.30 వేల కోట్ల విలువైన జలధార మంచినీటి పనులు చేస్తున్నామని చెప్పారు పవన్ ఇంకా ఏమన్నారంటే..
అడిగినవన్నీ చేస్తాం..
2019-24 నడుమ ఇలా మాట్లాడే ధైర్యం వైసీపీ మీకు (గిరిజనులకు) ఇవ్వలేదు. కానీ కూటమి నేతలు మీమాట వింటారు. మీరు అడిగినవన్నీ చేస్తాం.. కానీ చేతిలో మంత్రదండం లేదు కదా.. హూంఫట్ అంటే వచ్చేయడానికి!.. అందుకే కొంచెం సమయం ఇవ్వండి. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించండి. సెల్‌టవర్లు, కనెక్టివిటీ రోడ్లు, పాఠశాలలకు సంబంధించి.. ఇలా ప్రతిదీ ఇస్తాం. మేం పైస్థాయిలో చేస్తే కింది స్థాయిలో ఫలితం రావాలంటే మీరు కూడా అంతే సమర్థంగా పనిచేయాలి. మాకు అధికారంపై వ్యామోహం లేదు, బాధ్యత ఉంది. 2019 నుంచి 2024 వరకూ ఒక్క రోడ్డు వేయకుండా డబ్బులన్నీ శిలాఫలకాలకు, వేసిన రంగులకే కొత్త రంగులు వేసి.. కోర్టు తిడితే ఆ రంగులు తీసేసి.. ఇలా వందల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టారు. రూ.100 కోట్లు ఖర్చు చేస్తే రంపచోడవరం వంటి నియోజకవర్గానికి రోడ్లు వచ్చేస్తాయి.
కానీ వైసీపీ ఎంతో నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మేం డబ్బులు కిందకు పంపిస్తున్నాం. మేం డబ్బులు (కమీషన్లు) అడిగే అవసరం లేదు. మీరు బాగుండాలనే చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. ప్రధాని మోదీ ఇస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు, సీఎం చంద్రబాబు ఇచ్చే నిధులు తీసుకొస్తూ.. ఉన్న అప్పులను తీరుస్తూ కొత్త అప్పులను చేస్తూ.. మధ్యలో ఆదాయం పెంచుకుంటూ ఓ విధంగా జగ్లింగ్ చేస్తున్నాం. మాకు మీ శుభాశీస్సులు, అండదండలు కావాలి. స్థానిక ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారం కూటమికి ఇవ్వాలి. అలా చేస్తే మేం మరింత ధైర్యం అభివృద్ధి చేయగలుగుతాం.
మనసు లోతుల్లోంచి మాట్లాడతారు..
గిరిజన యువత, ఆడపడుచులు కష్టనష్టాలు తెలిసినవాళ్లు. నాలా గుండె లోతుల్లోంచి మాట్లాడతారు. తెలివితేటలు చూపించరు. నేను తెలివితేటలు వాడను. మనసే వాడతాను. దానివల్ల కష్టాలు ఉంటాయి.. అలాగే ఫలితాలు కూడా ఉంటాయి. మీరు అండగా ఉంటే నాకు కొండంత ధైర్యం. అభివృద్ధి ఫలాలను ప్రతి గిరిజన గ్రామానికి చేర్చడమే కూటమి సంకల్పం.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్